తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ ది పేగు బంధమని.. కాంగ్రెస్ ది అధికారం కోసం అహంకారమని ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha) అన్నారు. కాంగ్రెస్కు పెట్టే గుణం లేదని, అధికారకాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు. పచ్చబడ్డ తెలంగాణను ఆగం కానివ్వద్దని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి(Dharmapuri) లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధమని, ఏమీ లేని నాడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినాడు కూడా ప్రజలతో ఉన్నామని, ఇప్పుడు కూడా ప్రజలతోనే ఉంటున్నామని కవిత అన్నారు. ఉమ్మడి పాలనలో కరెంటు ఉండేది కాదని, నీళ్లు లేవని, రైతులకు ఒక్క పైసా ఇచ్చిన వాళ్లు లేరని కవిత గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ల అవకాశం ఇస్తే ఏం చేసిందని కవిత ప్రశ్నించారు.
కాంగ్రెస్కు 55 ఏళ్లు అవకాశమిస్తే పింఛన్లు రూ.200 ఇచ్చారని, రైతులకు పైసా ఇవ్వలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీది పెట్టే గుణం కాదని, అధికారకాంక్ష మాత్రమే ఉంటుందని మండిపడ్డారు. తమది పేగు బంధం అయితే కాంగ్రెస్ వాళ్లది అధికారం కోసం అహంకారమని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం కాదని, అనుబంధం శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదు.. కేసీఆర్ పథకం అందని ఇళ్లు లేదని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్లు రూ.5వేలకు పెరుగుతుందన్నారు, పోలింగ్ తేదీ నాడు ఓటు వేయడానికి వెళ్లే ముందు లైట్ వేయాలని, ఒకవేళ లైట్ వెలిగితే బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయాలన్నారు. గతంలో కరెంట్ ఉంటే వార్త అని, ఇప్పుడు కరెంట్ లేకపోతే వార్త అని కవిత అన్నారు.
ప్రధాని మోదీ పాలనలో నిత్యావసరాలు పెరగడంతో పేదల పాలిట గుదిబండలా మారిందని విమర్శించారు. రూ. 1200గా ఉన్న సిలిండర్ ధరను సబ్సిడీ కింద రూ. 400కే ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత వెంట ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంతు తదితరులు ఉన్నారు.