ఆర్య వైశ్యు (Arya Vaishya) లకు తమ పార్టీ తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (MLC) కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. నామినెటెడ్ పోస్టుల్లోనూ వారికి అవకాశం కల్పించామన్నారు. భవిష్యత్తలోనూ వారికి మరిన్ని అవకాశాలు వస్తాయని ఆమె భరోసా ఇచ్చారు. నిజామాబాద్‌లో బిగాల కృష్ణమూర్తి ఆర్యవైశ్య భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ…. పేదరికాన్ని కొలమానంగా తీసుకుని తమ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తోందని చెప్పారు. ఏ కులానికి చెందిన పేదవారికైనా తమ ప్రభుత్వం అండగా నిలబడుతోందన్నారు. పేద ఆర్య వైశ్య కుటుంబాలకు చెందిన కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి జరిగితే గతంలో ఏ ప్రభుత్వమైనా చేదోడు వాదోడుగా నిలబడిందా? ఆలోచించాలన్నారు.
వైశ్యులంటే పది మందికి అన్నంపెట్టేవాళ్లని పూర్వ కాలం నుంచి పేరు ఉందన్నారు. ఆర్య వైశ్య భవన నిర్మాణానికి బీఆర్ఎస్ రూ.1.5 కోట్లను ఇచ్చిందని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. గణేశ్ గుప్తా మంచి మనసున్న గొప్ప వ్యక్తి అని ఆమె కొనియాడారు. ఆయనకు ఆర్యవైశ్యులంతా అండగా వుండాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఆయనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
స్థానికంగా యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్ధేశంతో ఇటీవల నిజామాబాద్ లో ఐటీ హబ్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరి కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు వస్తాయని తెలిపారు. తాజాగా మరో కంపెనీ కూడా పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు వచ్చిందన్నారు. 260 సీట్ల వరకు తీసుకుంటామని ఆ కంపెనీ వర్గాలు చెబుతున్నాయన్నారు.