కాంగ్రెస్ (Congress) హామీ ఇచ్చినట్లుగా కొత్త పింఛన్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఊసే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (MLC) కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇస్తామని వెల్లడించారు. కానీ హామీలను నెరవేర్చకపోతే ప్రజల తరుపున కొట్లాడుతామని హెచ్చరించారు. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల కోసం పొరాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. తనకు మహబూబ్ నగర్ జిల్లాతో ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు. కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేసినప్పటి నుంచి తనకు అనుబంధం ఉందన్నారు. ఇక్కడి ఎంపీగా ఉండి కేసీఆర్ తెలంగాణను సాధించారని తెలిపారు. ఆ విషయం తనకు చాలా గర్వ కారణమన్నారు.
తనకు నిజామాబాద్ ఎలాగో, మహబూబ్ నగర్ కూడా అలాగేనని స్పష్టం చేశారు. జిల్లాలో వలసలను ఎలా ఆపాలో తాము పూర్తి స్థాయిలో అధ్యయనం చేశామని పేర్కొన్నారు. ఇక్కడ 35 లక్షల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉందన్నారు. సాగునీరు లేకపోవడంతోనే ప్రజలు వలస వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎం పదవి చేపట్టిన తర్వాత 11 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకు వచ్చారన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. ఇంకా 10 శాతం పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. ఇదే జిల్లా నుంచి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారని అన్నారు. కానీ ఈ ప్రాజెక్టు టెండర్లను రద్దు చేస్తామంటున్నారని మండిపడ్డారు. టెండర్లను ఎందుకు రద్దు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు.
చివరి అనుమతుల కోసం సీఎం రేవంత్ ప్రయత్నించాలని సూచించారు. ప్రధానితో కేసీఆర్ కు సత్సంబంధాలు లేకపోవడం వల్లే కేంద్రం సహకరించ లేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, ఇప్పుడు ఆయన కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకోండన్నారు. లేదా కేంద్రంతో పోట్లాడండన్నారు. కానీ ప్రజల పనులు పూర్తి చేయండని సూచనలు చేశారు. ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదని, కానీ మనం ఉద్యమ కారులమన్నారు. ఏ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి పోరాడాలి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.