మహిళలకు సాధికారత.. దేశానికే సాధికారత.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి.. ఇది ఎందుకు ప్రాధాన్యం కాకూడదు అంటూ కొన్నాళ్ల క్రితం ఉద్యమానికి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha). లిక్కర్ స్కాం విచారణ సమయంలోనే ఈ నినాదం అందుకోవడంతో ఈ ఇష్యూ బాగా హైలైట్ అయింది. అయితే.. అటు విచారణ ఆగింది.. ఇటు కవిత ఉద్యమం సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో మరోసారి కవిత పోరాటంపై చర్చ జరుగుతోంది.
115 మంది అభ్యర్థుల జాబితాను కేసీఆర్ (KCR) విడుదల చేశారు. అందులో ఏడుగురు మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు. అంటే.. కనీసం 7 శాతం శాతం కూడా అవకాశం కల్పించలేదు. ఇప్పుడే కాదు.. కేసీఆర్ ఎప్పుడూ ఇంతకుమించి మహిళలకు ఎక్కువ అవకాశం ఇచ్చింది లేదు. అయితే.. మహిళా రిజర్వేషన్ కోసం కవిత పోరాడుతున్న ఈ సమయంలో ఇంత తక్కువగా సీట్లు మహిళలకు కేటాయించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ లో మహిళా బిల్లు పెట్టాలని 33 శాతం రిజర్వేషన్లకు ఆమోదించాలని డిమాండ్ చేసిన కవిత.. తన తండ్రి దగ్గర ఎందుకు డిమాండ్ చేయలేకపోయారని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
బీఆర్ఎస్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా చూస్తుంటే ఈసారి అధికారంలోకి రాలేమని కేసీఆర్ కు అర్థమైంది. లోక్ సభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ దీక్షలు చేసిన వారు.. తెలంగాణలో 7 స్థానాలు మాత్రమే మహిళలకు ఇచ్చారు. 33 శాతం అంటే ఏడు సీట్లేనా?. మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వడం ద్వారా కేసీఆర్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. బీజేపీ భయంతోనే గజ్వేల్ తోపాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు.
కవిత రివర్స్ ఎటాక్
మహిళా రిజర్వేషన్లపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు సార్లు మోసం చేసింది. సంఖ్యాబలం ఉన్నా కూడా ఈ బిల్లును ఎందుకు ఆమోదించట్లేదు? చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును బీజేపీ తీసుకురావాలి. చట్టం ఉన్నందునే స్థానిక సంస్థల్లో 14 లక్షల మంది మహిళలకు ప్రాతినిధ్యం దక్కింది. మీ రాజకీయ అభద్రతను మహిళా ప్రాతినిధ్యానికి ముడి పెట్టొద్దు. పార్లమెంట్ లో మహిళా ప్రాతినిధ్యాన్ని 1/3 పెంచాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తాయో చూద్దాం.