టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు(Maheshbabu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల గుంటూరు కారం(Gunturu Karam) సినిమాతో హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు రాజమౌళితో ఓ అడ్వెంచర్ సినిమాలో నటించడానికి కసరత్తులు చేస్తున్నాడు. అయితే మహేశ్‌బాబు సినిమాల్లో హీరోగా రాణిస్తుంటే ఒకరు మాత్రం ఆయన విలన్ అని విమర్శించారు.
అసలు విషయానికి వస్తే.. నల్లగొండ జిల్లా(Nallagonda District) కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, తెలంగాణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం జరిగింది. ఇందులో తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ మహేశ్‌బాబుపై సంచలన కామెంట్స్ చేశారు.
ముందుగా అందరికీ నూతన ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ జనవిజ్ఞాన వేదిక వారు, టీఎస్ యూటీఎఫ్ వారు గత పదేళ్లుగా సహజ పానీయాలు తాగాలని అవగాహన కల్పించడం గొప్ప విషయమన్నారు. అనంతరం హీరో మహేష్ బాబు హీరో కాదు విలన్ అని షాకింగ్ కామెంట్ చేశారు. మహేష్ బాబు ఎక్కువగా హానికరమైన కూల్ డ్రింక్స్‌కు యాడ్స్ చేస్తూ కృతిమ పానీయాలకు యాడ్ ఎజెంట్స్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు.
సమాజానికి చెడు చేసే ప్రకటనల్లో భాగస్వామ్యం అవుతున్నారని మండిపడ్డారు. ఇకనైనా మహేష్ బాబు అలాంటి యాడ్స్‌లో కనిపించకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ప్రకృతి పానీయాలు నిమ్మరసం, కొబ్బరినీరు, చెరుకు రసం, మజ్జిగ, రాగి జావా, పండ్ల రసాలు ప్రకృతి సిద్ధమైన పానీయాలు మాత్రమే తాగాలన్నారు. కృతిమ పానీయాలైన కూల్ డ్రింక్స్ తాగొద్దని చెప్పారు. తెలిసీ ఆరోగ్యానికి ప్రమాదంలోకి నెట్టొద్దని సూచించారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.