ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య (MLC Ramachandraiah) తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా అనంతరం రామచంద్రయ్య ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ(YCP) ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే తాను రాజీనామా చేశానని స్పష్టం చేశారు.
వైసీపీలో రాజకీయంగా ప్రజాస్వామ్యం కనిపించలేదని రామచంద్రయ్య అన్నారు. సీఎం జగన్ క్యాడర్ సలహాలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, వందల కోట్లు ప్రజాధనం కోర్టులో కేసులకు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సలహాదారులైనా సరైన సలహాలు ఇచ్చి సీఎం జగన్ను మారిస్తే బాగుంటుందంటూ రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసుల కోసం కేంద్రంతో రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు వదులుకున్నారని, సాధికారత సభల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని సీ రామచంద్రయ్య తెలిపారు. తాను ప్రజా జీవితంలో రాజీపడకుండా బతుకుతున్నానని, ఎమ్మెల్సీగా ఇంకా మూడు సంవత్సరాల పదవీకాలం ఉన్నానని తెలిపారు. ప్రజల ఆస్తులను కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని రామచంద్రయ్య ఆరోపించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో సీఎం వైఎస్ జగన్ చూసుకోవాలని హితవు పలికారు. పార్టీలో నుంచి బయటకు వచ్చిన వారిని స్క్రాప్ అంటున్నారని, పార్టీలో చేరాలని తమ ఇంటిచుట్టూ తిరిగినప్పుడు స్క్రాప్ అని తెలియదా? అని ప్రశ్నించారు.