ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్(MicroSoft) ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. గత 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న వర్డ్ ప్యాడ్(WordPad) కు ఇక స్వస్తి పలుకుతున్నట్లు తెలిపింది. విండోస్ 95 (Windows 95) తో పరిచయమైన వర్డ్ ప్యాడ్ ను ఇక రానున్న విండోస్ వెర్షన్లలో వర్డ్ ప్యాడ్ ఉండదని వివరించింది.
డాక్యుమెంట్ రైటింగ్‌లో దీనిని విరివిగా వినియోగిస్తున్నారు. అయితే వర్డ్ ప్యాడ్ స్థానంలో సరికొత్త ఆప్షన్లతో అప్ గ్రేడ్ వెర్షన్ నోట్ ప్యాడ్ ను వినియోగించుకోవాలని మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయం నెటిజన్లను ఆశ్చర్యపర్చింది. మైక్రోసాఫ్ట్ ఆటోసేవ్, ట్యాబ్‌ల ఆటోమేటిక్ రీస్టోరల్ వంటి ఫీచర్లతో నోట్ ప్యాడ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
మైక్రోసాఫ్ట్ తన విండోస్ నోట్ ప్యాడ్ యాప్‌ను మొదటిసారిగా 2018లో అప్డేట్ చేసింది. అప్పటి నుంచి విండోస్ 11 వర్షన్‌కు దీనికి సంబంధించిన ట్యాబ్‌లను యాడ్ చేస్తూ వచ్చింది. వర్డ్ పాడ్‌కు అదే స్థాయిలో డిమాండ్ లేకపోవడం వల్ల దీన్ని శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించింది.
విండోస్ 7, విండోస్ 8 రీడిజైన్ తరువాత వర్డ్ ప్యాడ్‌పై పెద్దగా దృష్టి సారించలేదు మైక్రోసాఫ్ట్ కంపెనీ యాజమాన్యం. వర్డ్ ప్రాసెసర్‌ను అప్డేట్ చేయలేదు. ఇక దాన్ని పూర్తిగా తీసివేయాలనే నిర్ణయానికి వచ్చింది. 2024లో విడుదల చేయబోయే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకుని రాబోయే విండోస్ 12లో వర్డ్ ప్యాడ్ కనిపించకపోవచ్చు.