రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం తెలంగాణ (Telangana) మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన విషయంలో వేగం పెంచింది. ఈ క్రమంలో రేపు ఢిల్లీ (Delhi) పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. అక్కడ మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన విషయంపై కాంగ్రెస్ (Congress) పెద్దలతో చర్చించనున్నట్టు సమాచారం..
మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో రేపు సాయంత్రం 4. 30 గంటలకు రేవంత్, భట్టి మర్యాదపూర్వకంగా ప్రధానిని కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు.. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల నుంచి సమాచారం..
పనిలో పనిగా కాంగ్రెస్ పెద్దలను కలవనున్న సీఎం, డిప్యూటీ సీఎం.. పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది. వీటితో పాటుగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై సైతం చర్చించే అవకాశం ఉంది. ఆరు ఎమ్మెల్సీ పోస్టులకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా.. వీటన్నింటిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రేపటి ఢిల్లీ పర్యటనతో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుందని తెలుస్తోంది..
కాగా నాగ్‌పూర్‌లో ఎల్లుండి జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో సీఎం, డిప్యూటీ సీఎంలు పాల్గొంటున్నట్టు పార్టీ వర్గాలు సమాచారం.. మరోవైపు నాలుగు రోజుల క్రితమే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే అసెంబ్లీలో విద్యుత్ రంగంపై వాడీవేడీ చర్చలు జరుగుతోన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పర్యటనను వాయిదా వేసుకున్నారని వార్తలు వచ్చాయి..