పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఒకరిని మించి మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, హామీలపై మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etala Rajender) తీవ్ర విమర్శలు చేశారు.
ఆదివారం మల్కాజిగిరి(Malkajgiri mp segment) పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఇందు ఫార్య్చూన్ విలాస్‌లో నిర్వహించిన ఆత్మయ సమ్మేళనంలో ఈటల పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలను మరో జన్మ ఎత్తినా వాటిని అమలు చేయడం సాధ్యం కాదన్నారు. గతంలో తనకు ఆర్థికమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని అదే ఎక్స్ పీరియన్స్ తో కాంగ్రెస్ హామీలు ఆచరణ సాధ్యం కాదని ముందే చెప్పానన్నారు.
ఇటీవల మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు(Ex Minister Harish Rao) పంద్రాగస్టు వరకు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని అనే వరకు వెళ్లిందంటే పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు జరగాలంటే రూ.2లక్షల కోట్లు కావాలని, కానీ రాష్ట్రంలో అదనంగా రూ.5వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉందన్నారు.
అలాంటప్పుడు కాంగ్రెస్ హామీలు అమలు ఎలా సాధ్యమో ఆలోచించాలన్నారు. జై శ్రీరామ్ పేరుతో ప్రధాని నరేంద్రమోడీ ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తోంది. దీనికి ఈటల రాజేందర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మోడీ కేవలం అభివృద్ధి పేరుతోనే ఓట్లు అడుగుతున్నారని, జై శ్రీరాం పేరుతో ఓట్లు ఎక్కడా అడుగడం లేదని విమర్శించారు.
ఎవరైనా సరే.. కళ్లు నెత్తికెక్కి మాట్లాడకూడదని, మన పరిధి , స్థాయిని మించి మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారనే సోయి ఉండాలని హెచ్చరించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు కోట్ల మందికి ఇండ్లు కట్టించిందని, బీఆర్ఎస్ ఎంత మందికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టి ఇచ్చిందో చెప్పాలన్నారు.