ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) వరుస పర్యటనలతో తెలంగాణ (Telangana)లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈ ఎలక్షన్ సీజన్ వేసవిని తలపించేలా మంటెక్కుతోంది. నిన్న ఆదిలాబాద్‌లో పర్యటించిన ప్రధాని.. పవర్ఫుల్ పంచ్‌లతో రెండు పార్టీలకూ చెమటలు పట్టిస్తున్నారు. మూడోసారి విజయమే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక నేడు సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై పలు విమర్శలు చేశారు.
తెలంగాణను కాంగ్రెస్ (Congress) కొత్త ఏటీఎంగా మార్చుకుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లది అవినీతి బంధం అని ఎద్దేవా చేశారు. వీరిద్దరూ ఒకే నాణేనికి రెండు ముఖాలని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) మధ్య పొత్తు ఉందన్న విషయం ప్రజలందరికి అర్థమైందన్నారు. బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం పేరుతో దోచుకుందని ఆరోపించారు. ఒకరి స్కామ్‌ను మరొకరు కప్పిపుచ్చుకొంటున్నారని విమర్శించారు.
ప్రజలను మోసం చేస్తూ.. ఆడే ఇలాంటి ఆటలు ఎక్కువ రోజులు సాగవని.. సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి గానీ, వైమానిక దాడులు చేసేందుకు గానీ మోడీ సర్కార్ వెనుకాడదని పేర్కొన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నది హిందుస్థాన్ కాదా? మోడీ హామీ నెరవేరిందా లేదా? అని ప్రశ్నించారు. కొన్నేళ్లలో భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చబోతున్నామని.. ఈ హామీ కూడా నెరవేరుతుందని.. ఎందుకంటే ఇది మోడీ గ్యారంటీ అని తెలిపారు.
మరోవైపు కుటుంబ పార్టీలపై విరుచుకుపడ్డ మోడీ.. జమ్మూ కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ఎక్కడైనా సరే.. కుటుంబ పార్టీలు ఉన్న చోట కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని.. రాష్ట్రాలు మాత్రం బాగుపడలేదని మండిపడ్డారు. కుటుంబ పార్టీలు అధికారంలో ఉన్నచోట.. యువతకు అవకాశాలు దొరకడం లేదని అన్నారు. మోడీకి కుటుంబం లేదని విమర్శించడంపై ఆగ్రహించిన ఆయన.. ఈ దేశ ప్రజలే తన కుటుంబం అని చెప్పారు. వాళ్లు ఫ్యామిలీ ఫస్ట్ అని అంటున్నారని.. మోడీ మాత్రం నేషన్ ఫస్ట్ అని భావిస్తారని తెలిపారు.
నల్లధనాన్ని దాచుకోవడానికి కుటుంబ పార్టీల సభ్యుల భారతదేశం వెలుపల బ్యాంకు ఖాతాలను తెరుస్తారని.. తాను మాత్రం పేదలకు జన్ ధన్ ఖాతాలు తెరిచి వారి వృద్ధికి తోడ్పడుతున్నాని పేర్కొన్నారు. వారి పిల్లలను ఉద్ధరించడానికి కుటుంబ పార్టీలు భారతదేశ వనరులను విక్రయించారని.. తాను దేశ ప్రజల పిల్లల కలలను నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నానని మోడీ తెలిపారు..