Modi: తన ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి దీటైన సమాధానమిచ్చామని ప్రధాని మోడీ (Modi) అన్నారు. అందువల్లే పార్లమెంటులో ఓటింగ్ కి భయపడి వారు వాకౌట్ చేశారన్నారు. శనివారం బెంగాల్ లో బీజేపీకి చెందిన క్షేత్రీయ పంచాయతీరాజ్ పరిషద్ నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి వర్చ్యువల్ గా ఆయన ప్రసంగించారు. మణిపూర్ (Manipur) పరిస్థితిపై వాళ్ళు దేశానికంతటికీ తప్పుడు, ప్రతికూల ప్రచారం చేశారని ఆరోపించిన ఆయన.. వారు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సభలో దీటుగా ఓడించామని, మధ్యలోనే సభ నుంచి నిష్క్రమించారని చెప్పారు.
ఇలాంటి తీర్మానాలు తమకెప్పుడూ అదృష్టమేనని, తాజాగా పెట్టిన తీర్మానం కూడా రానున్న ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ప్రజలనుంచి మద్దతు పొందడానికి తమకు ఉపకరిస్తుందని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమానికి ఉద్దేశించిన ముఖ్యమైన బిల్లులపై చర్చ జరగవలసిన అవసరం ఉందని, కానీ ప్రతిదానినీ రాజకీయం చేయడంలోనే ప్రతిపక్షాలు ఆసక్తి చూపుతూ వచ్చాయని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ (Congress) గురించి మోడీ పరోక్షంగా ప్రస్తావిస్తూ .. సభలో మాట్లాడిన విపక్ష నేతల్లో ఎవరూ ‘పెద్ద’ లీడర్ లేరన్నారు. ఆ పార్టీకి చెందిన అధిర్ రంజన్ చౌదరికి మాట్లాడేందుకు సమయమివ్వాలని కోరిన అమిత్ షా (Amit Shah) దే ఔన్నత్యమని ఆయన చెప్పారు. పశ్చిమ బెంగాల్ లో పంచాయతీరాజ్ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసకు అధికార తృణమూల్ కాంగ్రెస్ దే బాధ్యత అని మోడీ ఆరోపించారు.
రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ నేతృత్వం లోని ఈ పార్టీ.. బీజేపీ అభ్యర్థులను బెదిరించిందని, బూత్ క్యాప్చరింగ్ కి పాల్పడిందని అన్నారు. బీజేపీ అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయకుండా చూసేందుకు గూండాలకు కాంట్రాక్టులిచ్చారని మోడీ దుయ్యబట్టారు .ఎన్ని బెదిరింపులు వచ్చినా భయపడకుండా ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన బీజేపీ అభ్యర్థులను అభినందిస్తున్నానన్నారు.