Modi : చందమామపై పేర్ల రగడలో రాజకీయాలు ఎంటరయ్యాయి. చంద్రయాన్-3 (Chandrayaan-3) చంద్రుడిని తాకిన చోటును ‘శివశక్తి’ పాయింట్ గా వ్యవహరించాలని ప్రధాని మోడీ ‘పేరు’ పెట్టగా.. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది హాస్యాస్పదంగా ఉందని, చంద్రునికి మోడీ యజమాని కారని ఈ పార్టీ నేత రషీద్ అల్వీ దుయ్యబట్టారు. జాబిల్లి ఉపరితలంపై ఇలా పేరు పెట్టే హక్కు మోడీకి లేదని, ఇది చూసి ప్రపంచమంతా నవ్వుతుందని అన్నారు. చంద్రయాన్-3 సక్సెస్ కావడం హర్షించదగినదేనని, ఇందుకు మనమంతా గర్వించాలని ఆయన పేర్కొన్నారు.
కానీ చంద్రునికి మనం యజమాని కామని చెప్పిన ఆయన.. చంద్రయాన్-1 మిషన్ సమయంలో 2008 లో అది చంద్రునిపై క్రాష్ అయినప్పటికీ ఆ పాయింట్ ని మనం జవహర్లాల్ పాయింట్ అని వ్యవహరించామన్నారు. ఇంకా నయం.. మోడీ తనపేరు గానీ వాజ్ పేయి వంటి మరే ఇతర బీజేపీ నేత పేరుగానీ పెట్టలేదు అని రషీద్ అల్వివ్యాఖ్యానించారు
.ఏ విషయంలోను జవహర్లాల్ నెహ్రూతో మీరు పోటీ పడజాలరు..నెహ్రూ కారణంగానే ఇస్రో ఏర్పడింది అని చెప్పారు. 1962 లో నెహ్రూ, విక్రమ్ సారాభాయ్ ఇస్రోను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మొత్తానికి మోడీ ప్రతిదీ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అయితే దీనిపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహ్ జాద్ పూనావాలా తీవ్రంగా స్పందిస్తూ ..తాను హిందుత్వ వ్యతిరేకినని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పుకుంటోందని, అందులో ఇదీ భాగమని ట్వీట్ చేశారు. రాముడి ఉనికిని ఎప్పుడూ ప్రశ్నించే ఆ పార్టీ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని కూడా వ్యతిరేకించిందన్నారు. ప్రధాని పేర్కొన్న శివశక్తి పాయింట్, తిరంగా రెండూ ఈ దేశానికి సంబంధించినవని పేర్కొన్నారు. కాంగ్రెస్ సదా గాంధీ కుటుంబాన్ని పొగుడుతుంటుందన్నారు. విక్రమ్ ల్యాండర్ కి విక్రమ్ సారాభాయ్ పేరును పెట్టిన విషయాన్ని విస్మరించరాదన్నారు.