– స్పీడ్ పెంచిన బీజేపీ
– మరోసారి రాష్ట్రానికి ప్రధాని మోడీ
– ఈసారి మూడు రోజుల టూర్
– షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర నాయకత్వం
– సభలు, రోడ్ షోలతో ఫుల్ బిజీ
ఎన్నికలకు వారం రోజులే ఉంది. ఉన్న ఈ కొద్ది రోజులను గట్టిగా వాడేసి ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి పార్టీలు. సైలెంట్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్న బీజేపీ (BJP).. అగ్ర నేతలను, ఇతర రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలను రాష్ట్రానికి రప్పిస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం మాజీ సీఎం యడియూరప్ప (Yediyurappa) తెలంగాణ (Telangana) కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక (Karnataka) లో కాంగ్రెస్ (Congress) ఇచ్చిన 5 గ్యారెంటీలు అమలు కాలేదన్నారు. అక్కడి ప్రజలను మోసం చేసిన సిద్ధరామయ్య ప్రభుత్వం దివాలా దిశగా నడుస్తోందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అంటూ ప్రచారం చేస్తోందని.. వాటిని నమ్మి మోసపోవద్దన్నారు. అలాగే, ఎంపీ తేజస్వి సూర్య, అసోం సీఎం హిమంత శర్మ టూర్లకు కూడా ప్లాన్ చేసింది బీజేపీ.
ఓవైపు ఇతర రాష్ట్రాల్లో బలమైన నేతల్ని రంగంలోకి దింపుతూనే.. ఇంకోవైపు ఢిల్లీ పెద్దలను కూడా తీసుకొస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాని మోడీ (PM Modi) పర్యటించగా.. మరోసారి ఆయన్ను తెలంగాణకు పట్టుకొస్తోంది. ఈసారి ఏకంగా మూడు రోజులపాటు ఆయన ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసింది. తాజాగా దీనికి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 25న కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో మోడీ ప్రచారం చేయనున్నారు. 26న దుబ్బాక, నిర్మల్ పబ్లిక్ మీటింగ్స్ లో పాల్గొంటారు. 27న మహబూబాబాద్, కరీంనగర్ సభలు, హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొననున్నారు.
25న పీఎం షెడ్యూల్
25న మధ్యాహ్నం 1.25 గంటలకు దుండిగల్ విమానాశ్రయం
2.05 గంటలకు కామారెడ్డి
2.15 నుంచి 2.55 వరకు సభలో పాల్గొంటారు
సాయంత్రం 4.05 గంటలకు రంగారెడ్డి
4.15 నుంచి 4.55 వరకు బహిరంగ సభ
రాత్రి 7.35 గంటలకు బేగంపేట విమానాశ్రయం
అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజ్ భవన్ కు చేరుకుంటారు.
రాత్రికి రాజ్ భవన్ లోనే బస
26న పీఎం షెడ్యూల్
26వ తేదీన దుబ్బాక, నిర్మల్ లో పర్యటిస్తారు
ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు కన్హయ్య శాంతివనంలో జరిగే కార్యక్రమం
మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బాకకు వెళ్తారు
2.15 గంటల నుంచి 2.45 వరకు పబ్లిక్ మీటింగ్
సభ అనంతరం నిర్మల్ కు వెళ్లనున్నారు.
మధ్యాహ్నం 3.45 నుంచి సా.4.25 వరకు బహిరంగ సభ
దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని సా.5.45 గంటలకు తిరుపతి వెళ్తారు
27న పీఎం షెడ్యూల్
27న మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్స్
తిరుపతి నుంచి బయలుదేరి 11.30 గంటలకు హకీంపేట విమానాశ్రయం చేరుకుంటారు
అక్కడి నుంచి మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం 12.45 నుంచి 1.25 వరకు బహిరంగ సభ
సభ అనంతరం కరీంనగర్ టూర్
మ.2.45 గంటల నుంచి 3.25 వరకు బహిరంగ సభ
సాయంత్రం 4.40కి హైదరాబాద్
5 గంటల నుంచి 6 గంటల వరకు రోడ్ షో
రోడ్ షో అనంతరం 6.25 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనం