భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami) మానవత్వాన్ని చాటుకున్నాడు. నైనిటాల్(Nainital)లో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. తమ ముందు వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి రోడ్డుపక్కన లోయలో పడబోయింది. గమనించిన షమీ వెంటనే తన కారు ఆపాడు. ప్రమాదానికి గురైన కారులో ఉన్న వ్యక్తి ప్రాణాలను రక్షించాడు.
దీనికి సంబంధించిన వీడియోను షమీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. ‘ఇతడు చాలా అదృష్టవంతుడు. దేవుడు అతడికి రెండు జీవితాలు ఇచ్చాడు. నైనిటాల్‌లో ఘాట్ రోడ్డు మీదుగా మా కారు ముందు వెళ్తున్న కారు కింద పడి పోయింది. అతడిని మేము సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం’ అని షమీ క్యాష్షన్ ఇచ్చాడు.
వన్డే ప్రపంచ కప్‌లో ఇరగదీసిన షమీ అత్యధిక వికెట్లను పడగొట్టి టీమిండియాలో తిరుగులేని పేసర్‌గా పేరుతెచ్చుకున్నాడు. ఈ స్పీడ్‌ష్టర్ ఏడు మ్యాచుల్లోనే 24 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు గాయం కావడంతో ఆట మధ్యలోనే వెనుదిరగాల్సి వచ్చింది. పాండ్య స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన షమీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.
ప్రపంచ కప్ వేటలో విజృంభించిన షమీ తానేంటో నిరూపించాడు. ఆడిన తొలి మ్యాచ్ నుంచే షమీ అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌లు సైతం షమీ ఆటతీరును మెచ్చుకున్నారు. ఫైనల్‌లోనూ షమీ రెండు కీలక వికెట్లను తీశాడు.