మాజీ మంత్రి(Ex minister) మోత్కుపల్లి నర్సింహులు(mothkupalli narsimhulu) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్రెడ్డి(Revanth reddy) ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని నరసింహులు జోస్యం చెప్పారు. ఇవాళ ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బేగంపేటలోని తన నివాసంలో ఉపవాస దీక్షకు కూర్చున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరు కాదన్నా రేవంత్రెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ బలపడిందన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని, కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదన్న వార్తలొస్తున్నాయన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే మాదిగలకు న్యాయం జరిగిందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు.
వందశాతం రుణమాఫీ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. కేసీఆర్కు ప్రజలు పదేళ్లు అవకాశమిచ్చారని, మళ్లీ అధికారం చేపట్టేందుకు దొంగలను కేసీఆర్ గ్రామాల మీదకు పంపాడని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా నిర్భందించి జైల్లో పెట్టడం దారుణమన్నారు. జైల్లో కిరాతకులు ఉండాలే గానీ జీవితాన్ని అంకితం చేసిన వాళ్లు కాదని వ్యాఖ్యానించారు.
ఏపీ సీఎం జైల్లో ఉండి వస్తే అందరూ జైలుకు పోవాలా? అని ప్రశ్నించారు. జనసేన కలవటంతో ఏపీలో చంద్రబాబుకు బలం పెరిగిందన్నారు. చంద్రబాబుకు మద్దతుగా పవన్ ముందుకు రావడం శుభపరిణామమన్నారు. పవన్ కల్యాణ్ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉందని, టీటీపీ, జనసేన కొన్ని ప్రాంతాల్లో స్వీప్ చేయబోతున్నాయని జోస్యం చెప్పారు. అవకాశం వస్తే.. తను చంద్రబాబును కచ్చితంగా కలుస్తానని, ఇల్లు దాటని భువనేశ్వరికి బయటకు రావాల్సి రావడం బాధాకరమని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తంచేశారు.