ఎంపీ అరవింద్, ఎమ్మెల్సీ కవితల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ సెటైర్లు విసిరారు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూనే సాఫ్ట్‌గా సెటైర్లు విసిరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇంతకీ.. ఆరవింద్ ఆ వీడియోలో కవితను ఉద్ధేశిస్తూ ఏం అన్నారంటే..
‘అయ్యెపాపం కవితకు బాగలేనట్టున్నది. సీఎం కేసీఆర్ కూతురు ఎన్నడు ఏపాపం చేయలేదు. రూపాయి కూడా తినలేదు. తెలంగాణ ప్రజలను ముంచలేదు. వందరోజుల్లో చెరుకు ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, పసుపు ధర తెచ్చింది. పసుపు ధర తగ్గినప్పుడల్లా కేంద్రానికి కవిత తండ్రి సీఎం కేసీఆర్ లెటర్ రాసిండు.’అని సెటైర్లు విసిరారు. కవిత అసలు ఎమ్మెల్సీ పదవికే అర్హురాలు కాదన్నారు.
సీఎం కేసీఆర్ ఇటీవల మేనిఫెస్టోతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. ప్రజలు ఉండగా ఇవ్వనిది రైతు చనిపోతే రూ.5లక్షలు, అనారోగ్యంతో చనిపోతే రూ.10లక్షలు ఇస్తామనడంపై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో కొవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు ప్రజలు ఆసుపత్రి పాలై లక్షల డబ్బులు కడుతున్నా ఒక్కరికైనా ఆరోగ్యశ్రీ కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవన్ పథకాన్ని కానీ అమలు చేసిన పాపాన పోలేదన్నారు. కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజల ప్రాణాలంటే లెక్కలేదన్నారు. అందుకే ఆరోగ్య బీమా ఇవ్వకుండా చనిపోయాక బీమా డబ్బులు ఇస్తామంటున్నారని.. ఇవన్నీ దొరబుద్ధులు అంటూ ఫైర్ అయ్యారు.
ఒక తెలంగాణ ఆడబిడ్డేనా? అని అరవింద్ ప్రశ్నించారు. తన ఇంటిపైకి రౌడీలను పంపించి దౌర్జన్యానికి పాల్పడ్డప్పుడు కవిత ఆడపడుచు తనం ఏమైందని అరవింద్ విమర్శించారు. తనను చెప్పుతో కొట్టేంత సీన్ కవితకు లేదన్నారు. కవిత గురించి ఏమైనా అంటే తెలంగాణ ప్రజలు హర్షిస్తారే తప్పా సింపతి చూపించరన్నారు. తెలంగాణ ప్రజలను దోచుకొని, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నరని అన్నారు. యువతను గంజాయికి బానిసలను చేసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఎంపీ అరవింద్ ధ్వజమెత్తారు.