నిజామాబాద్ (Nizamabad) టూర్ లో మంత్రి కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ అరవింద్ (Aravind) స్పందించారు. కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయినా, ఆయన మాకు సంస్కారం నేర్పడం ఏంటని ప్రశ్నించారు. పార్లమెంటులో తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండటం వల్లే నిజామాబాద్ లో జరిగిన ప్రోగ్రాంకి వెళ్లలేదని.. దానిని కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని ఫైరయ్యారు. ఢిల్లీ (Delhi) లో మీడియాతో మాట్లాడిన అరవింద్.. కేసీఆర్, కేటీఆర్ మోసపూరిత వాగ్ధానాలు నమ్మవద్దని సూచించారు.
దమ్ముంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని అరవింద్ సవాల్ చేశారు. అప్పుడు, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో తేలిపోతుందన్నారు. కేసీఆర్ కుమారుడు అనేదే కేటీఆర్ అర్హత అని సెటైర్లు వేశారు. మిషన్ కాకతీయ బడ్జెట్ అంతా కవితకు అప్పజెప్పారని.. తాను రాలేదని అంటున్న కేటీఆర్ సభకు కవిత ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
బడ్జెట్ లో గృహలక్ష్మి పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు చూపారని.. వాస్తవంగా ఒక్క రూపాయి కేటాయించలేదని ఆరోపించారు అరవింద్. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కేవలం మూడు రోజుల సమయమే ఇచ్చి.. మద్యం టెండర్లకు మాత్రం 15 రోజులకుపైగా టైమ్ కేటాయించడాన్ని తప్పుబట్టారు. ప్రజలను మోసం చేసేందుకే కొత్త కొత్త స్కీంలను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ట్రాప్ లో ప్రజలు పడొద్దని సూచించారు.
అరవింద్ పై కేటీఆర్ విమర్శలు
అరవింద్ కు పెద్దలను గౌరవించడం తెలియదు. మతం గురించి మాట్లాడి రెచ్చగొట్టడం ఒక్కటే తెలుసు. ఏదో గాలిలో గెలిచిన అరవింద్ సీఎం కేసీఆర్ ను ఇష్టారీతిలో మాట్లాడుతున్నారు. మేము ఆయన తండ్రి డీ శ్రీనివాస్ ను దూషించలేమా?. పెద్దలను గౌరవించడం హిందూ సంప్రదాయం. ఎంపీకి అది తెలియదు. అరవింద్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ గల్లంతు చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.