Telugu News » Danger Daughter : గుండెల మీద ఆడించాడు.. ఆ గుండెల్లోనే గునపం దించింది!!

Danger Daughter : గుండెల మీద ఆడించాడు.. ఆ గుండెల్లోనే గునపం దించింది!!

కంటే కూతుర్నే కనాలి అన్నారు. తన ప్రేమ పెళ్లికి తండ్రి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి అవిటి వాణ్ని చేయించింది.

by sai krishna

కంటే కూతుర్నే కనాలి అన్నారు. తనకు కూతురు పుట్టిందని ఎంతో సంబర పడ్డాడు ఆ తండ్రి. తన తల్లే మళ్లీపుట్టిందనుకుని మురిసిపోయాడు.అల్లారు ముద్దుగా పెంచాడు. ఓ యోగ్యుడికి ఇచ్చి కూతురు పెళ్లి ఘనంగా చెయ్యాలని అనుకున్నాడు.

కానీ కూతురు ఆలోచనలు క్రూరంగా ఉన్నాయి. తన ప్రేమ పెళ్లికి తండ్రి అడ్డుగా ఉన్నాడని అడ్డు తొలగించుకోవాలనుకుంది.ఆ మేరకు ప్రియుడితో కలిసి పథకం రచించింది. దాడి చేయించింది.కన్న పాపానికి ఇప్పుడా తండ్రి ఇంకా బతికున్నందుకు కుమిలిపోతున్నాడు.

వివరాల్లోకి వెళితే … సోలాపుర్ జిల్లా(Sholapur District) లోని మధ తాలుకాకు చెందిన మహేంద్ర షా..ఆ ప్రాంతంలో పేరుమోసిన వ్యాపారవేత్త. అతని కూతురు సాక్షి.అయితే ఆమె కొంతకాలంగా చైతన్య అనే యువకుడ్ని ప్రేమిస్తోంది.

ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ పెళ్లికి తండ్రి మహేంద్ర అడ్డుపడతాడని ఊహించిన సాక్షి తన తండ్రి కాళ్లు విరగ్గొడితే వాళ్ల పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుందని ప్లాన్ వేశారు.

పథకంలో భాగంగానే పుణెకు వెళ్లిన సాక్షి..ఆదివారం రాత్రి తిరిగి మధకు వచ్చింది. షెట్ఫాల్(Shetfall) ప్రాంతంలో బస్ దిగి తండ్రిని రమ్మని ఫోన్ చేసింది. దీంతో కూతురుని ఇంటికి తీసుకువెళ్లేందుకు కారులో వచ్చిన మహేంద్ర కూతురి కుటిల బుద్ధి గ్రహించ లేకపోయాడు.

అనంతరం తిరిగి వెళుతుండగా..వాడచివాడి గ్రామ(Wadachiwadi Village) సమీపంలో టాయిలెట్ వస్తుందని కారును ఆపించింది సాక్షి. ఆ వెంటనే రెండు బైక్లపై కారును ఫాలో అవుతున్న నలుగురు వ్యక్తులు మహేంద్రపై దాడి చేశారు.

దారుణంగా కొట్టి..అతని రెండు కాళ్లు విరగొట్టారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోయారు.

మహేంద్ర అరుపులు విన్న వాడచివాడి గ్రామ ఉప సర్పంచ్ బాపు కాలే, రామ్ చరణ్ అనే మరో వ్యక్తి ఘటన స్థలానికి వచ్చారు. తీవ్ర గాయాలతో ఉన్న మహేంద్రను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు.. బాధితుడి కూతుర్నే ప్రధాని నిందితురాలిగా తేల్చారు. కుట్రలో ఆమె ప్రియుడి హస్తం కూడా ఉన్నట్లు నిర్ధరించారు.

వీరిద్దరితో పాటు మహేంద్రపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పడు ఆ తండ్రి తాను ఇంకా ఎందుకు బతికున్నానని కుమిలిపోతున్నాడు.

You may also like

Leave a Comment