తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి చూస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్(BJP MP Laxman) ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డికి ఎందుకంత అభద్రతాభావమని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కావస్తోందన్నారు.
ఇచ్చిన హామీలు గ్యారెంటీ లు అమలు చేసి సజావుగా పాలించాలని బీజేపీ కోరుకుంటున్నదని తెలిపారు. అంతేకానీ కాంగ్రెస్ సర్కార్ కూలిపోవాలని బీజేపీ కోరుకోవడంలేదని స్పష్టం చేశారు. తమను కాపాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడం చూస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని తెలుస్తోందన్నారు. రేవంత్ మాత్రం బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎంపీ లక్ష్మణ్ పునరుద్ఘాటించారు. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే అవకాశం ఉందన్నారు. కాంగ్రస్ వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికి బీఆర్ఎస్ను అక్కున చేర్చుకుంటామంటే తమకు ఎలాంటి ఇబ్బందిలేదన్నారు. ఎంతమంది ఏకమైనా మోడీ నాయకత్వంలో ప్రజలు తమ వెంట ఉన్నారని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
దేశ వ్యాప్తంగా 400 పై సీట్లు సాధించి మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, పేద వర్గాలను చూస్తుంటే జాలి కలుగుతోందని, మౌలిక సదుపాయాలు లేవని మండిపడ్డారు. మాతృమూర్తుల కోసం ప్రధాని పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివస్తున్నారన్నారు. దీన్నిబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంగా ఉందో తెలుస్తోందని సెటైర్లు వేశారు.