బీఆర్ఎస్ (BRS)కు మరో షాక్ తగలబోతోందనే ప్రచారం జరుగుతోంది.. నాగర్ కర్నూల్ (Nagar Kurnool) సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు కల్వకుర్తి (Kalvakurthi) జడ్పీటీసీ భరత్ పార్టీ మారెందుకు సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం అధిష్టానం వారిని పట్టించుకొక పోవడమనే టాక్ వినిపిస్తోంది. తన కుమారుడు భరత్‌కు జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పదవిని మరొకరికి కట్టబెట్టారనే అసంతృప్తిలో రాములు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కేసీఆర్ (KCR), కొల్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఎంపీ పేరు లేదు. దీంతో తనను పార్టీలో కుట్రపూరితంగా కావాలనే దెబ్బతీస్తున్నారని ఎంపీ రాములు పలు సందర్భాలలో తన స్నేహితుల వద్ద వాపోయారని తెలుస్తోంది. అదీగాక నేడు నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం కార్యక్రమానికి ఎంపీ రాములు (Ramulu)కు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.
ఇక ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరవగా.. తాజా, మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలను ఆహ్వానించారు. ఇది అవమానంగా భావించిన ఎంపీ చిన్న బుచ్చుకొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం కేటీఆర్‌కు తెలియడంతో తన పీఏ ఫోన్ ద్వారా మధ్యాహ్నం నాగర్ కర్నూల్‌లో జరిగే సన్నాహక సమావేశానికి హాజరు కావలసిందిగా తెలిపినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ముందస్తుగా తనకు ఆహ్వానం లేని సమావేశానికి ఎలా రావాలని ఎంపీ రాములు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలు అవమానాలుగా భావించిన ఎంపీ.. పార్టీలో ఉండడం కన్నా వెళ్లిపోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన కుమారుడు భరత్ కూడా తండ్రి బాటలో నడవడానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం.