పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత(MP Venkatesh Netha) బీఆర్ఎస్(BRS)ను వీడి కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే, తాజాగా ఆయన బుధవారం తన ఎంపీ పదవికీ రాజీనామా చేశారు.
పెద్దపల్లి ఎంపీ స్థానం బాల్క సుమన్‌కు కేటాయించే చాన్స్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వెంకటేష్ నేత క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో ధాన్యం సేకరణ, కృష్ణా జలాల పంపిణీ అంశం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు వంటి అంశాలపై పార్లమెంటులో తాను గళం విప్పానని చెప్పుకొచ్చారు. కీలక అంశాల పరిష్కారం చేయాలని ధర్నా చేశామన్నారు.
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాలన బాగుందని కితాబిచ్చారు. గ్రూప్ వన్ అధికారిగా 18 సంల సర్వీస్ ఉండగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. మొదట కాంగ్రెస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి.. ఓడానన్నారు. ఆ తర్వాత పెద్దపల్లి ఎంపీగా టీఆర్ఎస్ నుంచి గెలిచానని తలిపారు. పార్టీ సిద్దాంతాలు నచ్చలేదని.. రాజీనామా లేఖలో కేసీఆర్‌కు స్పష్టం చేశానని అన్నారు.
బీజేపీ సహాయ సహకారాలతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని చర్చించడం వల్లే రాజీనామా చేశానన్నారు. అంతర్గత ఒప్పందాలు తనను బాధించాయన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తనకు రాజకీయ జన్మనిచ్చింది వెంకటేష్ నేత వెల్లడించారు. దేశాన్ని ముక్కలుగా విభజించాలని చూస్తున్న బీజేపీ పాలనకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తనను ఆకర్షించిందన్నారు.