విశాఖ(Vizag)లో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా(Vijayanagaram District) బంటుమిల్లి తహసీల్దార్ రమణయ్య(MRO Ramanaiah)ను దుండగులు ఇనుపరాడ్డులతో తలపై కొట్టి హతమార్చారు. కొమ్మాదిలోని తహసీల్దార్ నివాసముంటున్న అపార్ట్మెంట్లోకి చొరబడి ఆయనపై దాడి చేశారు. వాచ్‌మన్ గట్టిగా కేకలు వేయడంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్ చినగదిలి మండలాల్లో ఎమ్మార్వోగా రమణయ్య పనిచేశారు. రెండు రోజుల కిందట విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయ్యారు. మొదటి రోజు విధులకు హాజరై రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి రమణయ్య చేరుకున్నారు. రాత్రి సుమారు 10:15 గంటలకు ఫోన్ రావడంతో ఫ్లాట్ నుంచి తహసీల్దార్ కిందకు వచ్చారు.
ఓ వ్యక్తితో 10 నిమిషాల పాటు సీరియస్‌గా సంభాషణ జరిగినట్లు సమాచారం. గుర్తుతెలియని వ్యక్తి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే తహసీల్దార్‌ను అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పోలీసులు కీలక ఆధారలను సేకరించారు.
ఇద్దరు నిందితుల కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పంచలు కట్టుకున్న ఆ ఇద్దరు అక్కడ ఎందుకు వచ్చారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విధి నిర్వహణలో ముక్కు సూటిగా వ్యవహరించే రమణయ్యతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తహసీల్దార్ రమణయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
రమణయ్య సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిలాడ గ్రామం. పదేళ్లుగా ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, కలెక్టరేట్లో ఏవోగా పనిచేశారు. ఆయన స్వగ్రామంలోనే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.