కొత్త సంవత్సరం వేళ ఏపీ(AP)లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. కొత్త సంవత్సరం వేళ కాకినాడ జిల్లా(Kakinada District) కిర్లంపూడి(Kirlampudi)లోని ఆయన ఇంటికి అనుచరులు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. పొలిటికల్ రీ ఎంట్రీపై ఆయన ఇవాళ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
ముద్రగడ సహా ఆయన ఇద్దరు కుమారులకు అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజకీయాల్లోకి తిరిగి ఎప్పుడు వస్తారు? అని ముద్రగడను అనుచరులు అడుగుతున్నారు. కాకినాడలో ముద్రగడ పద్మనాభం చిన్న కుమారుడు గిరిబాబు మాట్లాడారు.
ముద్రగడ రాజకీయంకు సంబంధించిన పలు విషయాలపై గిరిబాబు స్పందించారు. ‘ముద్రగడ ఎప్పుడు పాలిటిక్స్‌కు దూరంగా లేరు. త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరతారు. ముద్రగడ ఆదేశిస్తే.. నేనూ పోటీ చేస్తా. ఇద్దరమూ పటీ చేయొచ్చు. చేరికకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.’ అని అన్నారు.
అదేవిధంగా రాజకీయాల్లోకి తిరిగి ఎప్పుడు వస్తారు? అని ముద్రగడను అనుచరులు అడగ్గా.. టైం వచ్చినప్పుడు అదే జరుగుతుందని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. ముద్రగడ తన కుమారులతో కలిసి వైసీపీలో చేరుతారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీలో ఆయనకు స్పష్టమైన హామీ వచ్చినట్లు సమాచారం. ఇవాళ్టి సమావేశంలో ముద్రగడ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయి.