కొద్ది రోజుల నుంచి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటిస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) సస్పెన్స్‌కు తెరదించారు. ఎట్టకేలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇవాళ ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో(Thadepalli Camp Office) ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి వైసీపీలో చేరారు.
ఈ సందర్భంగా ముద్రగడను సీఎం జగన్ ఆప్యాయంగా హత్తుకొని అభినందనలు తెలిపారు. ముద్రగడ రాజకీయ పార్టీలో చేరికపై ఇటీవల ప్రచారం ఊపందుకుంది. అయితే, తొలుత ఏపార్టీలో చేరతారో ఆయన స్పష్టత ఇవ్వలేదు. అనేక ఊహాగానాల మధ్య వైసీపీలో చేరతానని కుండబద్దలు కొట్టారు. అయితే సెక్యూరిటీ కారణాలతో అది కాస్త వాయిదా పడుతూ వచ్చింది.
ఇటీవల ఆయనే స్వయంగా వైసీపీలో తానొక్కడినే వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ఓ లేఖలో పేర్కొన్నారు. ఎట్టకేలకు ఆయన వైసీపీలో చేరగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే, ముద్రగడ పవన్ పై పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ముద్రగడ పోటీకిదూరంగా ఉంటే ఆయన కుమారుడు గిరి వైసీపీ అభ్యర్థిగా పవన్‌పై బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ విషయంపై రెండుమూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పిఠాపురం వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్తగా వంగా గీత విశ్వనాథ్ కొనసాగుతున్నారు.