మహావిష్ణువు స్వయంగా వెలసిన క్షేత్రాలలో ఒకటి సాలగ్రామ క్షేత్రం. దీనికే ముక్తినాథ్ (Muktinath Temple) అనే ఇంకోపేరు ఉంది. ఈ ఆలయం హిందువులకే కాకుండా బౌద్ధులకు కూడా పరమ పుణ్య ప్రదేశం. నేపాల్ (Nepal) లోని ముస్తంగ్ జిల్లాలో నెలవైన ఈ పరమ పవిత్ర క్షేత్రం సముద్రమట్టానికి 3,800 మీటర్ల ఎత్తులో ఉంది. రోజురోజుకీ ఈ ఆలయ సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. అదీగాక, ఇది పర్యాటక ప్రదేశం కావడంతో నేపాల్ ప్రభుత్వం మరిన్ని మెరుగైన సేవలను అందించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే కేబుల్ కార్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్ కు చెందిన కేఆర్ రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (K & R Rail Engineering Limited) కు ముక్తినాథ్ దర్శన్ ప్రైవేట్ లిమిటెడ్ (Muktinath Darshan Private Limited) కు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 48 నెలల్లో పూర్తి చేయాలని నేపాల్ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించిన వివరాలను కేఆర్ రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ సెక్రెటరీ చంద్రకాంత్ వివరించారు. ప్రాజెక్ట్ ఎంఓయూ కుదిరిందని తెలిపారు. భూసేకరణ 90 శాతం పూర్తికాగా, డీపీఆర్ చివరి దశలో ఉందన్నారు.
84.32 కిలోమీటర్లలో నిర్మించే ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.4 వేల కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు చంద్రకాంత్. ఇప్పటికే రుణానికి సంబంధించిన పనులు కూడా చివరి దశలో ఉన్నట్లు వెల్లడించారు. పర్యావరణ సంస్థ అధ్యయనం కూడా అయిపోతోందన్నారు. ఈ కేబుల్ కార్ ప్రాజెక్ట్ పూర్తయితే.. ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తుల ప్రయాణం చాలు సులువు అవుతుంది. ఈ ఆలయం బాగా ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో అక్కడకు వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేబుల్ రైల్ అందుబాటులోకి వస్తే తమ పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రాజెక్టు కోసం నేపాల్ కు చైనా ఆర్థిక సహాయం అందిస్తోంది. అక్కడి టూరిజం బోర్డు లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా నేపాల్ కు వెళ్ళిన వారిలో భారతీయ పర్యాటకులు ఎక్కువమంది ఉన్నారు. 6 లక్షల మంది ఆ దేశానికి వెళ్లగా.. వారిలో 2 లక్షల మంది భారతీయులే. ముక్తినాథ్ దేవాలయాన్ని సందర్శించి.. ఇక్కడి ప్రకృతిని ఆస్వాదించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో నేపాల్ ప్రభుత్వం కేబుల్ రైల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.