ములుగు(Mulugu) మండలం జంగాలపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సీతక్క (Sitakka) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నేను గెలిచాను కాబట్టే ములుగును జిల్లా చేశారని, పోరాటం చేసినందుకే అభివృద్ధి నిధులు ఇచ్చారని ఎమ్మెల్యే (MLA) సీతక్క వెల్లడించారు.
నా గెలుపు వల్ల ములుగు జిల్లా అయిందని, నేను అడిగితేనే ములుగులో సమీకృత కలెక్టరేట్, హెల్త్ ప్రొఫైల్, మెడికల్ కళాశాల, మల్లంపల్లి మండలం, ఏటూరునాగారం (Eturunagaram) రెవెన్యూ డివిజన్ అయిందని, పోడు భూములకు పట్టాల జారీ జరిగిందని సీతక్క అన్నారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ములుగు జిల్లాను మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని సీతక్క అన్నారు. గోదావరి జలాలను జిల్లాలోని చెరువులకు మళ్లించి సాగునీటి కష్టాలను తొలగిస్తానని పేర్కొన్నారు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన ఉంటూ పోరాడుతున్న నన్ను చూసి ఓర్చుకోలేని బీఆర్‌ఎస్ నాయకులు నాపై దుష్ప్రచారాలు చేస్తున్నారని సీతక్క తెలిపారు.. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.