ముంబయి విమానాశ్రయానికి(Mumbai Airport) బెదిరింపు ఈ మెయిల్(Mail) రావడం కలకలం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ఫీడ్ బ్యాక్ ఇన్‌బాక్స్‌కు గురువారం ఓ అగంతకుడు మెయిల్ పంపాడు. దీంతో ముంబై విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించారు.
రెండు రోజుల్లో 1 మిలియన్ డాలర్లు ఇవ్వకపోతే విమానాశ్రయాన్ని పేల్చేస్తాం అంటూ మెయిల్‌లో అతను బెదిరించాడు. బెదిరింపు మెయిల్‌లో.. ‘ఇది మీ విమానాశ్రయానికి చివరి హెచ్చరిక. బిట్‌కాయిన్‌లోని ఒక మిలియన్ డాలర్లు నేను పంపిన చిరునామాకు బదిలీ చేయబడకపోతే 48 గంటల్లో ఎయిర్ పోర్ట్ టర్మినల్-2ను పేల్చేస్తాం. 24గంటల తర్వాత మరో హెచ్చరిక ఉంటుంది’ అని ఈ మెయిల్‌లో ఉంది.
ఈ మెయిల్ id-quaidacasrol@gmail.com నుంచి బెదిరింపు మెయిల్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. విమానాశ్రయ సిబ్బంది ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని(IPC) సెక్షన్లు 385, 505 (1) (బి) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విమానాశ్రయంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి ఇటీవల బెదిరింపు మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తెలంగాణకు చెందిన ఓ 19 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరికొందరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. రూ.20కోట్లు ఇవ్వకపోతే అంబానీని హత్యచేస్తానంటూ ఓ వ్యక్తి మెయిల్ పంపించాడు. ఆ తరువాత రూ.200 కోట్లు , రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.