టీఎస్ ఆర్టీసీ (TS RTC) చైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (Muthireddy Yadagiri Reddy) బాధ్యతలు చేపట్టారు. బస్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar), ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనగామను మంత్రి కేటీఆర్ (KTR) డైరెక్షన్ లో దేశంలోనే టాప్ 3 మున్సిపాలిటీగా తీర్చిదిద్దానని పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ (Telangana) ఎక్కడుంది అనేవాళ్లకు.. గ్లోబల్ సిటీగా మార్చి కేసీఆర్ (KCR) బుద్ధి చెప్పారని అన్నారు.
ఉద్యోగులు, కార్మికులకు లాభం చేకూరేలా ప్రభుత్వంతో చర్చించి అన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని ముత్తిరెడ్డి తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో టీఎస్ ఆర్టీసీ సంస్థ అగ్రగామిగా ఎదిగిందని… తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని… ఉద్యోగులతో సమన్వయంగా కలిసి పని చేస్తానని అన్నారు.
ఎండీ సజ్జనార్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఆర్టీసీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు ముత్తిరెడ్డి. రాష్ట్రంపై పూర్తి అవగాహన కలిగిన ముఖ్యమంత్రిగా కేసీఆర్.. తెలంగాణను కాపాడే క్రమంలో అనేక సంస్కరణలు చేశారని గుర్తు చేశారు. అన్ని విభాగాలను అభివృద్ధి చేశారని కొనియాడారు.
ఇప్పటివరకు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి కొనసాగారు. ఆయన స్థానంలో ఇప్పుడు ముత్తిరెడ్డి బాధ్యతలు తీసుకునున్నారు. ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు ముత్తిరెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఈయనకు టికెట్ కేటాయించలేదు కేసీఆర్. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జనగామ నియోజకవర్గ అభ్యర్థి ప్రకటనను పెండింగ్ లో పెట్టారు. ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.