వైసీపీ(YCP) చేతగానితనంతోనే జాతీయ బ్యాంకులు బ్లాక్ లిస్టులో చేర్చాయని జనసేన(Janasena) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పేరుతో న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్, ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించలేదని నాదెండ్ల తెలిపారు. ఆ డబ్బులను దుర్వినియోగం చేసినందునే బ్యాంకులు బ్లాక్ లిస్టులో పెట్టాయని మనోహర్ తెలిపారు.
బాయంకుల వద్ద తీసుకున్న రుణాలను చెల్లించాలని కేంద్రం ఎన్నిసార్లు హెచ్చరించినా సీఎం జగన్ పెడచెవిన పెట్టారని ఆరోపించారు. సీఎం వైఖరితో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువును తీశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సెటైర్లు వేసుకునేలా చేశారని అన్నారు.
నిధుల దుర్వినియోగంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని నాదెండ్ల స్పష్టం చేశారు. వైకాపా చేతకానితనం వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ధనాన్ని వృథా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.