మరో పది రోజుల్లో జనసేన అభ్యర్థుల జాబితాను జనసేన అధినేత ప్రకటిస్తారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు(Jana Sena General Secretary Nagababu) వెల్లడించారు. విశాఖ(Vizag)లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ విడుదల చేస్తున్న జాబితాలపై స్పందించారు. వైసీపీ ఏడో జాబితా కాదు.. లక్ష జాబితాలు విడుదల చేసినా తమకు నష్టం లేదన్నారు.
వైసీపీ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు తప్ప.. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని నాగబాబు దుయ్యబట్టారు. జనసేన ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలో తమ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.
ఏపీలో అద్భుతం జరగోబోతోందని.. అద్భుతం జరిగేటప్పుడు అందరూ సహకరించాలంటూ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమన్నారు నాగబాబు. వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా జాతికి ప్రమాదకరమని సూచించారు. కరోనా వైరస్ తర్వాత ప్రమాదకర వైరస్ వైసీపీనే అంటూ సెటైర్లు విసిరారు. వైసీపీ వైరస్‌కు జనసేన, టీడీపీయే అసలైన మందుగా అభివర్ణించారు.
పార్టీలో ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకొని ముందుకెళ్తామన్నారు. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామన్నారు. టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంది కాబట్టి టీడీపీ నేత చింతకాయల విజయ్‌తో మర్యాద పూర్వకంగానే కలిశామని చెప్పారు. ఇదే సమయంలో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ అంశం చర్చకు రాలేదన్నారు. ఇక, తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని నాగబాబు వెల్లడించారు.