పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardhan Reddy) ఆదివారం కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి రాజీనామా(Resign)చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడికి పంపారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా లో కాంగ్రెస్ సెకండ్ లిస్టుల అనంతరం రాజీనామాల పరంపర కొనసాగుతోంది.
గత కొన్ని సంవత్సరాలుగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ప్రధాన భూమిక పోషించిన నాగం జనార్దన్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించలేదు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి టికెట్టు ఇవ్వడంతో నాగం తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమై చివరి వరకు టికెట్ కోసం ప్రయత్నించారు. ఢిల్లీ వెళ్లి అధిష్టానంతోను మాట్లాడారు. తన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తన అనుచరవర్గం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
నాగం బీఆర్ఎస్ చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సాయంత్రం నాగంను కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. మరో రెండు రోజుల్లో ఆయన బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.