లోక్ సభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల (Siricilla) ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు నాగర్ కర్నూలు (Nagar Kurnool) జిల్లా అచ్చంపేట (Acchampet)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రారంభించిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని అన్నారు. గ్రామాల్లో కేసీఆర్ (KCR)పై, తెలంగాణపై ప్రేమ ఉన్నవారు లక్షల్లో ఉన్నారని తెలిపారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని మండిపడ్డారు.
ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గెలుపు కోసం కాంగ్రెస్ అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు అదానీ, మోడీ మనిషని విమర్శించారు.. కానీ ఇప్పుడు వారితో ఒప్పందాలు చేసుకొంటున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే వారు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని పేర్కొన్నారు.
మరోవైపు పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రధాని మోడీ పదేళ్ల పాటు నమ్మబలికారని ఆరోపించారు. పదేళ్లు పూర్తయినా పాలమూరు పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కానీ కర్ణాటక, అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇచ్చిందని వివరించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రానికి చేసిందేంటని ప్రశ్నించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రియమైనవారు కాదని, పిరమైన ప్రధాని అని ఎద్దేవా చేశారు.
అచ్చంపేటలో పూర్వ వైభవం కోసం అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్లు ఉద్యమం చేశామని.. అనంతరం పదేళ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 24 ఏళ్లు వంద కిలోమీటర్ల వేగంతో కారు నాన్ స్టాప్ గా వెళ్లిందని తెలిపిన కేటీఆర్.. ఇప్పుడు కేవలం సర్వీసుకు మాత్రమే వెళ్లిందని, మళ్లీ తిరిగి జెట్ స్పీడ్‌లో దూసుకు వస్తుందన్నారు.
మరోవైపు కేటీఆర్‌ను అడ్డుకోవడానికి ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్తలు యత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. గత పదేళ్లలో అచ్చంపేటకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ఆయన పర్యటనను అడ్డుకొంటున్నామని తెలిపారు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అచ్చంపేట మండలం చెన్నారం సమీపంలో నిరసనలు చేపట్టారు.