Telugu News » Nagar Kurnool: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.. బాలింత మృతి..!

Nagar Kurnool: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.. బాలింత మృతి..!

జిల్లాలోని అమ్రాబాద్ మండలం(Amrabad Mandal) మన్ననూరు(Mannanur) గ్రామానికి చెందిన మేడమోని కల్పన(29) నిండు గర్భిణి. భర్త ఆంజనేయులు ఆమెను ప్రసవం నిమిత్తం గురువారం అచ్చంపేట వంద పడకల ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

by Mano
Nagar Kurnool: Negligence of government hospital doctors.. Infant died..!

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ బాలింత మృతిచెందింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. జిల్లాలోని అమ్రాబాద్ మండలం(Amrabad Mandal) మన్ననూరు(Mannanur) గ్రామానికి చెందిన మేడమోని కల్పన(29) నిండు గర్భిణి. భర్త ఆంజనేయులు ఆమెను ప్రసవం నిమిత్తం గురువారం అచ్చంపేట వంద పడకల ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

Nagar Kurnool: Negligence of government hospital doctors.. Infant died..!

 

అయితే ఆసుపత్రి సిబ్బంది ప్రసవం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయగా అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్ మాత్రం ప్రసవం చేయడానికి నిరాకరించాడు. ఆ డాక్టర్ నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రిలో చూయించుకోలేదనే అక్కసుతో ప్రసవం చేయకుండా నిరాకరించాడంటూ భర్త ఆంజనేయులు ఆరోపించాడు. దీంతో చేసేది లేక భార్య పురుటి నొప్పులతో బాధపడుతుండటంతో అచ్చంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు.

అక్కడి వైద్యులు తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలంటే రూ.35వేలు అవుతుందని చెప్పారు. దీంతో భర్త ఆంజనేయులు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించాడు. గురువారం రాత్రి ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ అనంతరం కల్పన మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ క్షేమంగానే ఉన్నా కల్పనకు రక్తస్రావం కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

దీంతో అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు గర్భసంచిని తొలగిస్తే రక్తస్రావం ఆగిపోతుందని చెప్పారు. దీంతో భర్త ఆంజనేయులు అంగీకరించగా ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించారు. అయినప్పటికీ రక్తశ్రావం ఆగలేదు. దీంతో ఆస్పత్రి వైద్యులు ఆంజనేయులుతో బలవంతంగా కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు.

బయట మరికొన్ని పరీక్షలు చేయించుకోవాలని చెప్పి ఆంజనేయులును బయటకు పంపించారు. ఆయన తిరిగి వచ్చే సరికి కల్పన రక్తశ్రావం అధికం కావడంతో మృతిచెందింది. అయినప్పటికీ జిల్లా ఆస్పత్రి సిబ్బంది ఆంజనేయులు ప్రమేయం లేకుండానే అంబులెన్స్‌లో ఎక్కించారు. అంతేకాదు తన భార్య మృతిచెందిందని చెప్పినా వినకుండా ఆమెకు ఆక్సిజన్ పెట్టి గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆదేశించారని ఆంజనేయులు వాపోయాడు. హైదరాబాద్‌లోని గాంధీకి తరలించగా అక్కడి వైద్యులు కల్పన మృతిచెందినట్లు భర్త ఫోను ద్వారా శుక్రవారం అర్ధరాత్రి రోధిస్తూ తెలిపారు.

తన భార్య మృతికి అచ్చంపేట ప్రభుత్వ వైద్యులే కారణమని భర్త ఆరోపించాడు. సకాలంలో వైద్యం అందించి ఉంటే తన భార్య ప్రాణాలతో ఉండేదని రోధించాడు. మృతిచెందడానికి కారకులైన వారిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని భర్త ఆంజనేయులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. పుట్టిన బిడ్డ తల్లి స్పర్శ కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో ఉండగా తల్లి నిర్జీవంగా గాంధీ ఆసుపత్రిలో ఉండటం పలువురిని కలచివేసింది. కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి.

You may also like

Leave a Comment