తెలంగాణలో పోలింగ్ నడుస్తున్న క్రమంలో నాగార్జున సాగర్ నీటిజలాల విడుదల అంశంపై కుట్ర చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది ముమ్మాటికీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ (Jagan), కేసీఆర్ (KCR)ల పనే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) ఆరోపించారు.
రామకృష్ణ గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ, ఆంధ్ర పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించటం వెనక ఎన్నికల లబ్ధి ఉందని విమర్శించారు. తెలంగాణలో సెంటిమెంట్ ద్వారా లబ్ధి పొందేందుకే ఈరోజు నాగార్జునసాగర్ వద్ద హైడ్రామాను షురూ చేశారని మండిపడ్డారు. ఇది జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపించారు.
నీటి సమస్యను ఇరు తెలుగు రాష్ట్రాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని రామకృష్ణ సూచించారు. ఆంధ్రాలో నీళ్లు ఉన్నా ఇవ్వడానికి జగన్మోహన్‌రెడ్డికి మనసొప్పడం లేదని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఈ వివాదంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక వైపు ఎలక్షన్ జరుగుతుంటే సాగర్ నీటి విడుదల ఆలోచన ఓట్ల కోసమేనంటూ ఆమె మండిపడ్డారు.
రాష్ట్ర విభజన సమయంలోనూ ఏపీ, తెలంగాణ సెంట్రల్ ఫోర్స్‌లను రంగంలోకి దింపారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. నాలుగు వందల మండలాల్లో కరువు ఉంటే వంద మండలాలకే పరిమితం చేశారని తెలిపారు. వ్యవసాయ శాఖామంత్రి అంటే ఎవరు అనేది ప్రజలు వెతుక్కుంటున్నారని పురంధేశ్వరి విమర్శించారు.