రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం (Water dispute) రోజురోజుకు ముదురుతుంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం మెయిన్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించిన ఏపీ పోలీసులు 13 గేట్ల వరకు బారికేడ్లు, ఇనుప కంచెలు వేసిన విషయం తెలిసిందే.. ఏపీ అధికారులు 5వ గేటు నుంచి కుడి కాల్వలోకి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల రోజునే ఈ వివాదం తెరపైకి రావడం చర్చాంశనీయంగా మారింది.
ఈ ఘటన నేపథ్యంలో నాగార్జునసాగర్ డ్యాం పై (Nagarjuna Sagar Dam)..ఏపీ (AP) తెలంగాణ (Telangana) పోలీసులు భారీగా మోహరించారు. అయితే నీటి విడుదలపై ఏపీ ఇరిగేషన్ అధికారులు వివరణ ఇచ్చారు. తాగునీటి కోసమే నీటి విడుదల చేసుకున్నట్లు చెబుతున్నారు. కాగా ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం కృష్ణ రివర్ బోర్డ్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి నాగార్జునసాగర్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ విభజన సమయం నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం రాజుకుంది. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ప్రాజెక్టు నిర్వహణను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. అయినా ఈ జల వివాదంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక ఒప్పందానికి రాకపోవడం వల్ల తరచుగా నీటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ఎన్నికల సమయంలో ఏపీ ప్రాజెక్టు అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా నీటిని విడుదల చేసుకోవడం వివాదస్పదంగా మారింది.
మరోవైపు ఓటింగ్ ముగియడంతో తెలంగాణ పోలీసు బలగాలు పెద్దఎత్తున డ్యాం వద్దకు చేరుకుంటున్నాయి. అవసరమైతే జేసీబీతో ఇనుప కంచెను తొలగించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు మిర్యాలగూడ డీఎస్పీ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరిస్తారని, ముళ్ల కంచెను తొలగించి వెనక్కి వెళ్లాలని ఏపీ పోలీసులకు సూచించారు. అయినా ఏపీ పోలీసులు స్పందించకపోవడంతో డ్యాం వద్ద ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది..