నాగార్జునసాగర్ (Nagarjunasagar) ప్రాజెక్టు జల వివాదం క్షణ క్షణానికి వివాదాస్పదంగా మారుతుంది. ఇప్పటికే పలువురు నేతలు ఈ అంశం పై స్పందించారు.. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి జల వివాదం పై స్పందించారు. ఎన్నికల సమయంలో ఏపీ (AP) అధికారులు ఇలా ప్రవర్తించడాన్ని ఖండిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం.. ప్రాజెక్టుల పై నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపనంత వరకు ఇలానే జరుగుతుందని జగదీష్ రెడ్డి (Jagadish Reddy) తెలిపారు.
చంద్రబాబు హయాంలో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరిగాయని ఆరోపించిన జగదీష్ రెడ్డి.. సమైక్యాంధ్రప్రదేశ్ లో మా హక్కులు హరించి మళ్లీ అదే పద్ధతుల్లో ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. నీటి వివాదాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ అజ్ఞానమే అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు నాగార్జున సాగర్ అంశంపై అంబటి రాంబాబు (Ambati Rambabu) వివాదాస్పద ట్వీట్ చేశారు. తాగు నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ రైట్ కెనాల్‌కి నేడు నీరు విడుదల చేయనున్నామని చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని మరింత పెంచేలా అంబటి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున కావాలనే కేసీఆర్ కు లబ్ధి చేకూరేలా వైసీపీ (YCP) ప్లాన్ చేసిందని వారు మండిపడుతున్నారు.
మరోవైపు ఈ అంశంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ (BRS)పై ఫైర్ అయ్యారు.. పోలింగ్‌కు ముందు రోజు కావాలనే సెంటిమెంట్ రగిల్చేందుకు ఈ వివాదాన్ని సృష్టించారని ఆరోపించారు. ఇక ఏపీకి చెందిన 500 మంది పోలీసులు నాగార్జున సాగర్ వద్దకు చేరుకుని, ప్రాజెక్టు 26 గేట్లలో సగభాగం అంటే 13వ గేటు వరకు తమ పరిధిలోకి వస్తుందని ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు.