టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్(Nakka Anand Babu) బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక కుంభకోణంలో సీఎం వైఎస్ జగన్(CM jagan) వాటా 50 వేల కోట్లయితే.. వెంకటరామిరెడ్డి వాటా ఎంత ? అంటూ ప్రశ్నించారు. దొంగ వే బిల్లుతో రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారనేందుకు తనవద్ద ఆధారాలున్నాయని చెప్పారు.
కలకత్తా నుంచి రహస్యంగా నడిపిన ఇసుక టెండర్ల విధానం మరో పెద్ద కుంభకోణం జరిగిందని ఆనంద్‌బాబు తెలిపారు. ఇసుక అక్రమాల్లో తనకు భవిష్యత్తులో శిక్ష తప్పదనే ముందుగా ఓ ఫిర్యాదు పడేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. గుండె ఆపరేషన్ వంకతో ఇంటినే కార్యాలయంలా మార్చుకున్న వెంకటరామిరెడ్డి రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారని ఆనంద్‌బాబు విమర్శించారు.
భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి మరీ వేల కోట్లు ఇసుక ద్వారా దోచుకున్నారు. ఇసుక కుంభకోణం డబ్బుతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని జగన్ చూస్తున్నాడని, ప్రతీ ఇసుక అక్రమ తవ్వకంలో ప్రధాన వాటాదారు ఏపీఎండీసీ వీసీ, డైరెక్టరుగా ఉన్న వెంకటరామిరెడ్డే అని ఆరోపించారు. డెప్యూటేషన్ మీద రాష్ట్రానికి వచ్చిన వెంకటరామిరెడ్డి, తెలుగుదేశం ఇచ్చిన ఉచిత ఇసుక విధానంలో అవినీతి అని ఫిర్యాదు చేశాడు.
ఇసుక అక్రమాలు, బిల్లుల చెల్లింపులపై తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక తప్పించుకు తిరుగుతున్నాడంటూ దుయ్యబట్టారు. ఇసుక తవ్వకాలపై దొంగ వే బిల్స్ విషయంలో కలెక్టర్ల నుంచి అధికారులంతా బలికావాల్సిందేనని, గంగా, కావేరి నదులు ఎక్కడ పుట్టాయో తెలీయని వాళ్లు సీఐడీ అధికారులుగా ఉండి, తప్పుడు ఫిర్యాదులపై కేసులు కట్టేందుకు సిద్ధంగా ఉంటారని ఎద్దేవా చేశారు.
ఇక, జేపీ వెంచర్స్ ఇచ్చిన ఇసుక ఒప్పందం ముగిసి ఆరు నెలలు దాటినా ఇంకా అదే సంస్థతో తవ్వకాలు కొనసాగిస్తున్నారని అన్నారు. మార్చి నెలలోనే హరిత ట్రిబ్యునల్ ఇసుక తవ్వకాలు నిషేధించినా, ఆదేశాలు బేఖాతరు చేశారని మండిపడ్డారు. చంద్రబాబుని అక్రమంగా జైలుకు పంపకముందు ప్రతీ అక్రమ ఇసుక తవ్వకాన్ని బట్టబయలు చేసినందుకే ఎదురు కేసులు పెట్టారని ఆనంద్ బాబు ఆరోపించారు.