ట్రావెల్స్ బస్సుల్లో(Travels bus) ప్రయాణించాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల తరచూ ట్రావెల్స్ ఏసీ బస్సుల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుంటున్నాయి. నవంబర్ నెలలో ఏకంగా మూడు బస్సులు అగ్నిప్రమాదానికి(Bus Fire Accident) గురయ్యాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సివస్తోంది.
తాజాగా నల్గొండ జిల్లా(Nalgonda) మర్రిగూడ(Marriguda) వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 38 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి నెల్లూరుకు బయల్దేరింది. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రలో ఉండగా నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును రోడ్డుపక్కన నిలిపి ప్రయాణికులను హెచ్చరించాడు. అయితే అప్పటికే మంటలు చుట్టుముట్టడంతో కొందరు ప్రయాణికులు అందులో చిక్కుకున్నారు. దీంతో బస్సులోనే ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. ఎటూ వెళ్లలేని పరిస్థితిలో బస్సులోనే సజీవ దహనమయ్యాడు. మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంపై వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది దాదాపు అరగంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సులో మంటలు చెలరేగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.