ఎన్నికలు వచ్చిన ప్రతి సారి రాజకీయ పార్టీల అవినీతి బయటకి వస్తుంది. ప్రజా సంక్షేమానికి నిధులు లేవంటున్న నేతలు ఎలక్షన్ల సమయంలో మాత్రం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో భారీగా నోట్ల కట్టలు, ఓటర్లకు పంచడానికి రెడీగా ఉన్న తాయిలాలు బయటపడుతున్నాయి. ఇలా ప్రజా స్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తూ దొడ్డిదారిలో పదవులు పొందుతున్న నేతలు స్వచ్ఛమైన ప్రజా సేవకు ఎలా అర్హులు అవుతారో అని విద్యావంతుల్లో కొందరు ఆలోచించే వారు లేకపోలేదు.
మరోవైపు అధికార పీఠం దక్కించుకోవడం కోసం అడుగులు వేస్తున్న నేతలు కొందరు ఓటర్లకు చీరలు పంచేందుకు సిద్దమైయ్యారు. రాజన్న సిరిసిల్ల (sircilla) జిల్లా నుంచి దాదాపు 80 డీసీఎం (DCM)లు, ఆర్టీసీ కార్గో సర్వీసు (RTC Cargo Service)లు ఈ చీరలను గమ్యస్థానాలకు చేర్చడానికి సిద్దం అయ్యాయి. వీటిని భూదాన్ పోచంపల్లి మండలం దంతూరు గ్రామంలోని హ్యాండ్లూమ్ పార్క్ కు పార్సల్ చేసిన విషయం బయటకి పొక్కింది.
అయితే ఓటర్లను కాపాడుకునే ప్రయత్నంలో పార్టీ నేతలు కొందరు మద్యం, డబ్బులే కాకుండా కానుకల పేరిట మహిళలకు ఎరవేస్తూ చీరల (sarees)ను పంచేందుకు సిద్దం అయినట్టు సమాచారం.. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున డీసీఎంలో ఫుల్ లోడుతో చీరలు ఉన్న వాహనాలు హ్యాండ్లూమ్ పార్క్ కు చేరుకోవడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఏది ఏమైనా అధికారుల అండదండలతోనే ఈ తంతు నడుస్తుందని విశ్వసనీయ సమాచారం.