కాంగ్రెస్ పార్టీ(Congress Party) చెన్నూరు అభ్యర్థి వివేక్ వెంకటస్వామి(Vivek Venkata Swami) ఇంట్లో ఐటీ సోదాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఐటీతో దాడులు చేయిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ ఎక్కడికి ప్రచారానికి వచ్చినా చెప్పులతో తరమాలంటూ ఘాటు విమర్శలు చేశారు.
హైదరాబాద్, మంచిర్యాలలోని వివేక్ ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. వివేక్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కంపెనీలు, ఆయన ముఖ్య అనుచరులు, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. వివేక్‌కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాకు బదిలీ అయిన రూ.8 కోట్లను సైఫాబాద్ పోలీసులు ఇటీవల స్తంభింపజేసిన సంగతి తెలిసిందే.
సుమన్ పిరికి వాడని, అందుకే ఐటీతో దాడులు చేయిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే ఓదేలు విమర్శించారు. ఇప్పుడు సుమన్ అసలు రూపం బయట పడిందని అన్నారు. కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ చూసి ఇలా ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఐటీ దాడులతో వివేక్‌కు మరింత మైలేజ్ వస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సోమాజిగూడలోని వివేక్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. నాలుగైదు గంటల పాటు తనిఖీలు సాగాయి. స్తంభించిన నగదుపై ఈ నెల 13న ఐటీ అధికారులు ఆరా తీశారు. కాగా, మంచిర్యాలలోని వివేక్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు, అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని వివేక్‌పై చెన్నూరు బాల్క సుమన్ ఆరోపించారు.