బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ఛట్ పూజను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(Mahipal Reddy) అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్ (Nandeshwar Goud) ఆరోపించారు. పూజను అడ్డుకునేందుకు పోలీసులను ఉసిగొల్పుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతు చూస్తా.. అంటూ నందీశ్వర్గౌడ్పై ఫైర్ అయ్యారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ ఆయన నివాసం వద్ద మాట్లాడుతూ.. బీజేపీ చేసే కార్యక్రమాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేందుకు పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
పటాన్ చెరులో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డికి ఎన్నికల్లో పంచేందుకు రూ.30కోట్లు డంప్ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదే మైత్రిలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నిర్వహించిన ఛట్ పూజకు ఎలా పర్మిషన్ ఇచ్చి తమకెందుకు ఇవ్వరని మండిపడ్డారు. ‘పోలీసులను తమపై ఊసిగొల్పితే సహించేది లేదు.. మహిపాల్ రెడ్డి.. నీ అంతు చూస్తా..’ అని నందీశ్వర్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.
మహిపాల్ రెడ్డి ప్రజల నుంచి దోచుకున్న డబ్బులతో పోలీసులును, వ్యవస్థ లనూ మేనేజ్ చేద్దామనుకోవటం సమంజసం కాదన్నారు. పోలీసులూ బీఆర్ఎస్కు తొత్తులుగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు రౌడిగా ఉన్న మహిపాల్ రెడ్డిపై లేని బైండోవర్ కేసులు బీజేపీ వారిపై ఎందుకు? అని ప్రశ్నించారు. సీఐని వెంటనే ఇక్కడ నుంచి మార్చాలని.. వారిపై ఉన్నతాధికారులకు, గవర్నర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.
మహిపాల్ రెడ్డికి రాజకీయ బిక్ష పెట్టింది తానేనని నందీశ్వర్‌గౌడ్ అన్నారు. తను డబ్బులిస్తే మహిపాల్ రెడ్డి తన జేబుకు టైర్లు వేయించుకున్నాడని వ్యాఖ్యానించారు. ఈ సారి 100, కోట్లు పెట్టినా మహిపాల్ రెడ్డి గెలవడని సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయానికి, అధర్మానికి జరుగుతున్న సంగ్రామం ఇది అని, సుప్రీం కోర్టు లో మహిపాల్ రెడ్డిపై ఇంకా కేసు నడుస్తోందని గుర్తు చేశారు.
చర్చిలు, మసీదులకు ఇచ్చిన ప్రాధాన్యం ఆలయాలకు ఇవ్వడంలేదని నందీశ్వర్‌గౌడ్ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. బహిరంగంగా పటాన్ చెరు రోడ్డుపై గోమాంసం అమ్మేస్తున్నారని, దుకాణదారుల నుంచి ఎమ్మెల్యే తమ్ముడు కిరాయి వసూలు చేస్తాడని నందీశ్వర్ గౌడ్ ఆరోపించారు. గో మాంసం దుకాణాలను రేపటి లోపుగా తీసేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆలయాలను కబ్జాచేసి అమ్మేస్తున్నారని మండిపడ్డారు.