‘సింగూర్’నానో (Nano) కార్ల కంపెనీ…. బెంగాల్ రాజీకీయాల్లో ప్రత్యేకంగా వినిపించే పేరు. ఈ కంపెనీ విషయంలో బెంగాల్ (West Bengal)లో ప్రభుత్వాలే మారి పోయాయి. కొన్ని పార్టీల కంచు కోటలే కూలి పోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దశాబ్దాల చరిత్రను ఒక్క సారి తలకిందులు చేసిన చరిత్ర ఆ కంపెనీది. తాజాగా బెంగాల్‌లో మరోసారి సింగూరు పేరు వినిపించింది.
ఈ సారి ఏకంగా ప్రభుత్వానికి షాక్ తగిలింది. సింగూరు భూ వివాదంలో సర్కార్ పై టాటా కంపెనీ విజయం సాధించింది. సింగూరులో టాటా నానో కార్ల తయారీ కంపెనీ మూసివేతతో పెట్టుబడిపై నష్టాన్ని వడ్డీతో సహా చెల్లించాలని సర్కార్ ను ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఆదేశించింది. మొత్తం రూ.766 కోట్లు చెల్లించాలని ముగ్గురు సభ్యుల ట్రిబ్యునల్ వెల్లడించింది.
1 సెప్టెంబర్ 2016 నుంచి ఏటా 11 శాతం వడ్డీతో పశ్చిమ బెంగాల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.765.78 కోట్లను రికవరీ చేసుకోవచ్చని టాటా కంపెనీకి అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించింది. ఈ కేసు విచారణ కోసం అయిన కోటి రూపాయల ఖర్చును కూడా సదరు సంస్థ నుంచి రికవరీ చేయాలని ట్రిబ్యునల్ వెల్లడించినట్టు టాటా మోటార్స్ వెల్లడించింది.
అసలేంటి వివాదం……!
పశ్చిమ బెంగాల్‌లో నానో కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని గతంలో టాటా కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు అప్పటి వామపక్ష ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంది. కంపెనీ ఏర్పాటు కోసం అప్పటి వామపక్ష ప్రభుత్వం సుమారు 1053 ఎకరాల మేర వ్యవసాయ భూమిని సేకరించింది. దీంతో వివాదం మొదలైంది.
రాజుకున్న వివాదం…..!
భూ సేకరణకు వ్యతిరేకంగా నందిగామ్, సింగూరు ప్రజలు కదం తొక్కారు. ప్రతిపక్ష నేత మమతా బెనర్జీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. ఈ నేపథ్యంలో టాటా కంపెనీ వెనకడుగు వేసింది. సింగూరు ఫ్యాక్టరీని గుజరాత్ లోని సానంద్ కు తరలించింది.
రాజకీయాల్లో కీలక మలుపు….!
భూ సేకరణ అంశంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగి పోయింది. తమ ఉద్యమానికి బాసటగా నిలిచిన టీఎంసీ వెంట నడవాలని ప్రజలు నిశ్చయించుకున్నారు. దీంతో బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వ మూడున్నర దశాబ్దాల ఏక ఛత్రాధిపత్యానికి బ్రేక్ పడింది. 2011లో టీఎంపీ సర్కార్ కు ప్రజలు పట్టం గట్టారు. సింగూరులో తమకు జరిగిన నష్టానికి రూ. 1,400 కోట్లు పరిహారం ఇవ్వాలని టాటా ఇటీవల కేసు దాఖలు చేసింది. తాజాగా ఆ కేసులో విజయం సాధించింది.