టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandra Babu) ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించే వారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఆయన ప్రజలకే మొదటి ప్రాధానత్య ఇచ్చే వారని, ఆ తర్వాతే కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే వారని చెప్పారు. సరైన రోడ్డు లేని, రాళ్లు, రప్పలు ఉన్న ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మాణం చేపడుతున్నారా అంటూ అంతా ఎగతాళి చేశారని అన్నారు. అవేవి పట్టించు కోకుండా చిత్తశుద్ధితో పనిచేసి హైటెక్ సిటీ ద్వారా లక్షల మంది ఐటీ ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం నింపారని చెప్పారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజక వర్గంలో అగరాలలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ….. తమ జీవితాల్లో వెలుగులు నింపుతారని టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని అన్నారు.
తన బాధను మహిళలు అర్థం చేసుకుంటారని తాను భావిస్తున్నట్టు చెప్పారు.
రాజకీయాలు చేసేందుకు తాను రాలేదనన్నారు. నిజం గెలవాలని చెప్పేందుకే తాను వచ్చానని స్పష్టం చేశారు. ఈ పోరాటం తనది కాదని, పోరాటం ప్రజలందరిదన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. 3 వేల మంది అనాథ పిల్లలకు చదువు చెప్పిస్తున్నామని వివరించారు.
పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించగా… వారిపై దాడి చేశారని అన్నారు. ఈ దారుణాలు ఇంకా ఎన్నాళ్లు అని ఆమె ప్రశ్నించారు. అందరం చేయి చేయి కలిపి పోరాటం చేద్దామన్నారు. అందరం కలిసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్దామన్నారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారని, కానీ ఏమీ చేయలేకపోయారన్నారు.
స్కిల్, రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్ ఇలా పలు కేసులు అంటున్నారని ఆమె చెప్పారు. కానీ ఏ కేసులో నైనా సరైన ఆధారాలు ఉన్నాయా అని ఆమె ప్రశ్నించారు. అయిదేళ్ల పాటు రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. కొన్ని సార్లు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పనిచేసేవారన్నారు. రాష్ట్రాభివృద్ధి గురించి ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం ధ్యాస లేదన్నారు.
ఎన్నికల ముందు తప్పుడు కేసులతో అరెస్టు చేసి చంద్రబాబును మానసికంగా ఇబ్బంది పెడితే టీడీపీ చెల్లాచెదురవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారని అన్నారు. కానీ చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆమె తెలిపారు. ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నో సమస్యలను అత్యంత ధైర్యంగా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. చంద్రబాబును అరెస్టు చేస్తే అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి మద్దతిచ్చారన్నారు.
రాష్ట్రాన్ని, న్యాయాన్ని జైలులో నిర్బంధించారన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా మనమంతా ముందడుగు వేద్దామన్నారు. ఈ రోజు కాకపోతే రేపు అయినా నిజమే గెలుస్తుందన్నారు. నిజం గెలవాలి, నిజమే గెలవాలనన్నారు. చంద్రబాబుపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. ఆయన కష్టాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు.