ఆంధ్రప్రదేశ్(Ap) ప్రజల కోసం అహర్నిశలు కష్టపడిన ప్రజా నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) అంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కంటతడి పెట్టుకున్నారు. మంగళగిరి(Mangalagiri) ఎన్టీఆర్ భవన్లో లోకేశ్ అధ్యక్షతన టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సందర్భంగా లోకేశ్ భావోద్వేగానికి గురయ్యారు.
లోకేశ్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు 72శాతం పనులు పూర్తి చేసిన చంద్రబాబును అక్రమంగా బంధించారని ఆరోపించారు. ‘2019లో ఒక్క ఛాన్స్ అంటే జగన్ను గెలిపించారు. నియంత మాదిరిగా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి తోసేశారు. సైకో జగన్ మొదటి నిర్ణయం.. ప్రజల కోసం కట్టిన ప్రజావేదిక కూల్చడం. దళితులు, బీసీలు, మైనారిటీలు, అనేకమంది టీడీపీ నాయకులపై వేల కేసులు పెట్టించారు. పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చిన చంద్రబాబును జైలుకు పంపిస్తారా? అని ప్రశ్నించారు.
ఇతర రాష్ట్రాల రాజధానులకు దీటుగా మన రాజధాని ఉండాలని అహర్నిశలు కష్టపడినందుకు చంద్రబాబును బంధించారని లోకేశ్ అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరడం, ఇసుక దోపిడీ, కల్తీ మద్యంపై మాట్లాడడం.. కరెంటు, ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు తగ్గించాలని అడగడమే ఆయన చేసిన తప్పా? అని నిలదీశారు. ఎప్పుడూ బయటకు రాని తన తల్లి రోడ్డుమీదికి రావాల్సిన దుస్థితి ఎదురైందని వాపోయారు. చివరకు తన తల్లిపైనా కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు.
అసెంబ్లీ సాక్షిగా ఈ సైకో జగన్, ఆయన సైన్యం ఆమెను అవమానించారని గుర్తుచేశారు. సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలు నా తల్లికి తెలియదని.. గవర్నర్ను కలిసేందుకు కూడా వెళ్లలేదన్నారు. చంద్రబాబుకు పంపించే భోజనంలో విషం కలుపుతారని మాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భోజనాల్లో విషం కలపడం, కోడికత్తి డ్రామాలు తమ డీఎన్ఏలోనే లేవని లోకేశ్ తెలిపారు. ‘చంద్రబాబు ఇచ్చిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.