ఒకరింట్లో చెత్త తీసుకొచ్చి పక్కింటి వద్ద వేస్తే బంగారం అవుతుందా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) అన్నారు. ఆయన చేపట్టిన శంఖారావం యాత్ర రెండోరోజు శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమ్మెల్యేల బదిలీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ(AP)లో ఈ సారి అధికారంలోకి వచ్చేది టీడీపీ-జనసేన (TDP-Jansena) ప్రభుత్వమే అని టీడీపీ నారా లోకేశ్(Nara Lokesh) ధీమా వ్యక్తం చేశారు.
జగన్ పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ 151 సీట్లు గెలిచి ఏం సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ కొత్త పథకం తీసుకొచ్చారని అదే ఎమ్మెల్యేల బదిలీ పథకమని విమర్శించారు. ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్ ఓటమిని ఒప్పుకున్నట్లేనని లోకేశ్ అన్నారు. ఒకరింట్లో చెత్త తీసుకొచ్చి పక్కింటి వద్ద వేస్తే బంగారం అవుతుందా అలానే ఒక నియోజకవర్గంలో పనిచేయని వాళ్లు ఇంకో నియోజకవర్గంలో చేస్తారా? అని ప్రశ్నించారు.
జగన్ సీఎం అవ్వకముందు సంపూర్ణ మద్యపాన నిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చాక కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారని విమర్శించారు. మద్యం తయారీ, విక్రయాలన్నీ వాళ్లే చేస్తూ జనం డబ్బు లాగేస్తున్నారని ఆరోపించారు. జే ట్యాక్స్ మొత్తం జగన్ జేబుల్లోకి వెళ్తోంది మద్యం విషం కన్నా ప్రమాదంగా మారే పరిస్థితి ఉందని లోకేశ్ అన్నారు. దేశ చరిత్రలో వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగనేనని అన్నారు నారా లోకేశ్.
యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని ఉద్యోగం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. 3 రాజధానుల పేరుతో జగన్ 3 ముక్కలాట ఆడుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడుల్లేవు ఉన్న పరిశ్రమలను తరిమేశారని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయనీయబోమని అవసరమైతే రాష్ట్రమే ఉక్కు పరిశ్రమ కొనుగోలు చేస్తుందని అన్నారు.
తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, ఆఖరికి చెత్తకూ పన్ను విధించారని, భవిష్యత్తులో గాలికీ వేస్తారేమోనని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని భూకబ్జాలు చేస్తూ ఎవరైనా వారిని ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెడుతున్నారని తెలిపారు.