ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ అసమర్థపాలనకు ఇంకెంతమంది బలవ్వాలి.. అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి వేలకోట్ల ఆస్తులపై ఉన్న శ్రద్ధ ఆర్టీసీ (RTC) కొత్త బస్సుల కొనుగోలు, నిర్వహణపై లేదని ఎద్దేవా చేశారు.
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లి ముగ్గురు అమాయకులు బలైన దుర్ఘటన మరువకముందే.. తాజాగా భీమవరం సమీపంలోని వీరవాసరంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కాజా శ్రీనివాసరావు (52) అనే ధాన్యం వ్యాపారిని ఢీ కొనడంతో మృతిచెందడంతో లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
మెయింటినెన్స్ లోపం కారణంగా ప్రమాదం సంభవించినట్లు స్పష్టమవుతున్నందున ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని లోకేశ్ ఆరోపించారు. మృతుడి కుటుంబానికి సరైన పరిహారం అందజేసి, ఇకనైనా దున్నపోతు ప్రభుత్వం కళ్లుతెరచి ఆర్టీసీ గ్యారేజిల్లో మెయింటినెన్స్‌కు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి గురైన బస్సు బ్రేకుల్లో సమస్య ఉన్నట్లు డ్రైవర్లు ముందుగా చెప్పినా.. స్పేర్ పార్టులకు డబ్బుల్లేవని మరమ్మతులతో సరిపెట్టిన దివాలాకోరు ప్రభుత్వమని దుయ్యబట్టారు.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో బస్సు ప్రమాదంలో ముగ్గురు, ఆతర్వాత భీమవరంలో ఒకరు మృతిచెందడంతో ఏపీలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం పరిహారానికి పరిమితమవుతున్నా బస్సుల ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.