ప్రజలను అష్టకష్టాలు పెడుతున్న జగనాసురుడి పాలన అంతమే లక్ష్యంగా అంతా కలిసి పోరాడుదామని, అదే రాష్ట్రానికి అసలు సిసలు విజయమని తెలుగు దేశం(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ దసరా(Dussehra) శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ‘మంచిని సాధించబోయే విజయానికి సంకేతం విజయదశమి సంబురం అని, చెడుకి పోయేకాలం దగ్గర పడటం దసరా సందేశం’ అని తెలిపారు. కాగా సోమవారం ఉదయం 11 గంటలకు చంద్రబాబుతో లోకేష్, బ్రహ్మణి ములాఖాత్ కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి మంజీర హోటల్‌లో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం కానుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం ఒంటి గంటకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకి చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన ర్యాలీగా మంజీర హోటల్‌కు చేరుకుంటారు. జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీపై చంద్రబాబుతో లోకేష్ చర్చించనున్నారు. కాగా సమన్వయ కమిటీ భేటీలో పవన్‌కళ్యాణ్, లోకేష్‌తో పాటు 14 మంది టీడీపీ, జనసేన ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఈ మేరకు టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈరోజు రాత్రి 7గంటల నుంచి 5 నిమిషాలు వీధుల్లోకి వచ్చి ‘సైకో పోవాలి’ అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని ఈ సందర్భంగా నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఆ వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు. సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయానికి సంకేతంగా ఈ విజయదశమి వేడుకను జరుపుదాం..’ అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు.