టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ను కలిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టు, అనంతరం ఏపీలో జరిగిన పరిణామాల గురించి రాష్ట్రపతికి నారా లోకేశ్ వివరించారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ పాలనా, ప్రతిపక్షాలపై అణచివేత చర్యల గురించి వివరించినట్టు లోకేశ్ వెల్లడించారు.
ఏపీలో ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును నొక్కుతోందని రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. కక్షపూరిత రాజకీయాలతో ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారని చెప్పామన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని సైతం కేసుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన చెప్పారు.
ప్రతిపక్ష టీడీపీ నేతలను అన్యాయంగా జైలుకు పంపిన తీరును రాష్ట్రపతికి వివరించామన్నారు. స్కిల్ డెవలప్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును రిమాండ్ కు పంపించిన విషయాన్ని రాష్ట్రపతికి చెప్పామన్నారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ కేసులో తనకు ఏమాత్రమూ సంబంధం లేదన్నారు.
కానీ తనపై కేసులు ఎలా పెట్టారో తెలియడం లేదన్నారు. దొంగ కేసులు పెట్టి తమను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. రోజుకు వదంతి పుట్టించి కేసులో వేధిస్తున్నారంటూ వాపోయారు. కేసులకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటానని వైసీపీ సర్కార్ ను ఆయన హెచ్చరించారు.
కక్ష సాధించాలనే ఉద్దేశమే తప్ప ఆ కేసుల్లో చంద్రబాబు పాత్ర లేదన్నారు. వాటిలో ఒక్క కేసులోనూ తమకు గానీ, తమ కుటుంబానికి గానీ ఒక్క పైసా కూడా రాలేదన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెడితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. శాంతి యుత పోరాటం చేయాలని చంద్రబాబు చెప్పారని, ఎక్కడా శాంతి భద్రతల సమస్య సృష్టించలేదన్నారు. రాష్ట్రపతిని కలసిన బృందంలో గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల, రామ్మోహన్ నాయుడు ఉన్నారు