ఎవరైనా తిరుపతి (Tirumala) వెళ్లాం అనగానే.. ముందుగా ప్రసాదం ఏది అనే ప్రశ్న ఎదురవుతుంది. తిరుమలేశుడి ప్రసాదం అంటే లడ్డూ. స్వామివారిని ఎంతగానో ఇష్టపడే భక్తులు.. లడ్డూ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా భావిస్తుంటారు. తిరుమలలో ఎన్నో రకాల ప్రసాదాలు అందుబాటులో ఉన్నప్పటికీ భక్తులకు లడ్డూ అంటేనే ఎంతో ప్రీతిపాత్రం. ఈ లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా ప్రతి ఏటా టీటీడీ (TTD) కోట్ల రూపాయలు ఆదాయంగా పొందుతోంది. అయితే.. రాను రాను తిరుమల లడ్డూలలో నాణ్యత తగ్గిపోతోందనే విమర్శలు ఎదురవుతున్నాయి.
ఈసారి అధికారమే లక్ష్యంగా యువగళం పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh).. తిరుమల లడ్డూ ప్రసాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కాకినాడ (Kakinada) రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన ఆయన.. 2024 మార్చి లేదా ఏప్రిల్ నాటికి ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు. వెంటనే తిరుపతి లడ్డూ ప్రసాదం నాణ్యతను పెంచుతామని హామీ ఇచ్చారు. లడ్డూ నాణ్యతా ప్రమాణాలు తగ్గిపోతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి అని ఆరోపించారు. టీడీపీ అధికారం చేపట్టగానే భక్తులకు పూర్తి నాణ్యతతో తిరుమల లడ్డూ అందిస్తామని వెల్లడించారు.
జగన్ సీఎం అయినప్పటి నుంచి రవాణా రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదని అన్నారు లోకేశ్. డీజిల్ ధరలు, ట్యాక్సులు ఇష్టారాజ్యంగా పెంచి వేధిస్తున్నారని ఆరోపించారు. రోడ్లన్నీ గుంతలమయంగా మారినా నాలుగున్నరేళ్లుగా తట్టెడు మట్టి కూడా పోయలేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక గ్రీన్ ట్యాక్స్, ఓవర్ లోడ్ ట్యాక్స్ తగ్గిస్తామన్న ఆయన.. పాడైపోయిన రోడ్ల స్థానంలో కొత్తవి వేస్తామని హామీ ఇచ్చారు.
ఇటు పాదయాత్రలో బాగంగా కాకినాడ రూరల్ లో మత్స్యకారులను కలిశారు లోకేశ్. మత్స్యకారుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం కింద మత్స్యకారులకు సబ్సిడీపై బోట్లు, వలలు, ఇతర పనిముట్లు అందజేశామని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మత్స్య సంపదను అమ్ముకునేందుకు అనువైన షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. కాకినాడలో మత్స్యకారుల పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.