ఏపీలో ఎన్నికల వేడి రాజుకొంటుంది.. ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress) పార్టీ.. టీడీపీ (TDP) కసరత్తు మొదలుపెట్టాయి.. ఇప్పటికే విమర్శలతో జనం దృష్టిని ఆకర్శించడానికి నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో దూకుడుగా వ్యవహరిస్తోన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh).. సమయం చిక్కినప్పుడల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకి చురకలు అంటిస్తున్నారు..
తాజాగా కడప (Kadapa) స్టీల్ ప్లాంట్ (Steel Plant) విషయంపై లోకేష్ వ్యంగస్త్రాలు వదిలారు.. అయ్యో… జగన్ కడప స్టీల్ ప్లాంట్ ఇంకా నిర్మించలేదా? అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) మాటలు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే, జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తొస్తారని లోకేష్ ఎద్దేవా చేశారు.. సీఎం మాటలు మాత్రమే కోటలు దాటుతాయి, పనులు మాత్రం గడపదాటవని విమర్శించారు. మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పి, శిలాఫలకం వేసి నేటికి నాలుగేళ్లయిందని లోకేష్ గుర్తుచేశారు.
ఎన్నికల ప్రచారంలో జగన్ రూ.15వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి, పాతికవేల మందికి ఉద్యోగాలిస్తానంటూ కోతలు కోసి.. అధికారంలోకి రాగానే నామాలు పెట్టారని నారా లోకేష్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.. ప్లాంట్ నిర్మాణం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉండగా, కనీసం తుప్పలు తొలగించేందుకు సైతం నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటని లోకేష్ మండిపడ్డారు.. తొలుత ఒప్పందం చేసుకున్న లిబర్టీ స్టీల్స్ పరారైందని, తర్వాత జేఎస్డబ్ల్యు అనే మరో కంపెనీని బతిమాలుకొని ఏడాది క్రితం మరోమారు శంకుస్థాపన చేశాడని నారా లోకేష్ అన్నారు.
మరో మూడు నెలల్లో సీఎం పదవీ కాలం పూర్తి కావస్తున్నా కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని లోకేష్ విమర్శలు చేశారు. ఏపీలో అభివృద్ధి శూన్యంగా మార్చిన ఇలాంటి దివాలాకోరు ముఖ్యమంత్రిని నమ్మి వేలకోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా? అని ప్రశ్నించిన నారా లోకేష్.. ఈ దరిద్రం పోతేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆరోపణలు చేశారు..